TRS: ప్రజల సంక్షేమం కోసమే నేను ఆలోచిస్తున్నాను: వంటేరు ప్రతాప్ రెడ్డి

  • కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్ల లేకపోయింది
  • టీఆర్ఎస్ సర్కారే మళ్లీ కావాలని ప్రజలు కోరుకున్నారు
  • ప్రజలకు మంచి జరగాలన్నదే నా తపన

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటమి పాలైందని ఆలోచిస్తే.. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే అన్న విషయం తనకు అర్థమైందని కాంగ్రెస్ పార్టీ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో కొద్దిసేపట్లో చేరనున్న ఒంటేరు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారని, అందుకే, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు విజయం లభించిందని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్ల లేకపోయిందని, ప్రజలు కేసీఆర్ ని నమ్మారని, టీఆర్ఎస్ సర్కారే మళ్లీ కావాలని కోరుకున్నారు కనుక తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయామని అన్నారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు తాను టీఆర్ఎస్ లో చేరనున్నట్టు చెప్పారు. టీఆర్ఎస్ లో చేరి ప్రజలు కోరుకునే విధంగా పనిచేస్తానని పేర్కొన్నారు. తాను ఎన్నిసార్లు ఓడిపోయినప్పటికీ ప్రజల సంక్షేమం కోసమే ఆలోచిస్తున్నానని, ప్రజలకు మంచి జరగాలన్నదే తన తపన అని చెప్పుకొచ్చారు.  

More Telugu News