రాజకీయ ప్రక్షాళన పవన్ కల్యాణ్ తోనే సాధ్యం.. అందుకే జనసేనలో చేరబోతున్నా!: బీజేపీ ఎమ్మెల్యే ఆకుల

18-01-2019 Fri 15:52
  • ఈ నెల 21న పవన్ సమక్షంలో పార్టీలో చేరుతా
  • పవన్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా
  • రాజమండ్రిలో మీడియాతో బీజేపీ నేత

ఈ నెల 21న(సోమవారం) తాను జనసేన పార్టీలో చేరుతానని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఆకుల సత్యనారాయణ తెలిపారు. పవన్ సమక్షంలో తాను జనసేనలో చేరుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థను పవన్ ప్రక్షాళన చేయగలరన్న నమ్మకం తనకు ఉందనీ, అందువల్లే జనసేనలో చేరుతున్నానని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని ప్రకటించారు. రాజమండ్రిలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యనారాయణ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా సత్యనారాయణ బీజేపీ టికెట్ పై గెలుపొందారు. ఆయన త్వరలోనే బీజేపీని వీడి జనసేనలో చేరుతారని గతకొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆకుల సత్యనారాయణ భార్య జనసేన పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు.