america: అమెరికా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ట్రంప్: నకిలీ 'వాషింగ్టన్ పోస్ట్' ఎడిషన్ కథనం

  • ట్రంప్ రాజీనామా చేశారంటూ తప్పుడు కథనం
  • ఉచితంగా ప్రతికను పంచిన కొందరు వ్యక్తులు
  • తమకు సంబంధం లేదన్న వాషింగ్టన్ పోస్ట్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పదవికి రాజీనామా చేశారన్న వార్తతో ఆ దేశ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనికి కారణం అక్కడి ప్రముఖ పత్రిక 'ది వాషింగ్టన్ పోస్ట్' ప్రచురించిన కథనమే. 'అన్ ప్రెసిడెంటెడ్' పేరుతో రాసిన కథనంలో 'సంక్షోభానికి ముగింపు పలుకుతూ వైట్ హౌస్ ను ఖాళీ చేసిన ట్రంప్. ట్రంప్ శకం ముగియడంతో ప్రపంచవ్యాప్తంగా సంబరాలు' అంటూ ప్రచురించింది.

 ఓవల్ కార్యాలయంలోని ట్రంప్ డెస్క్ పక్కన ఓ న్యాప్కిన్ దొరికిందని... తన రాజీనామాకు నిజాయతీ లేదని హిల్లరీ క్లింటన్, హైఫియర్, నకిలీ వార్తలు రాస్తున్న మీడియాను నిందించాలని దానిపై ట్రంప్ రాశారని తెలిపింది. ప్రస్తుతం రష్యాలోని క్రిమియాలో ఉన్న యాల్టా రిసార్టుకు ట్రంప్ వెళ్లిపోయారని... దీంతో, ఉపాధ్యక్షుడిగా ఉన్న మైక్ పెన్స్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారని వెల్లడించింది.

ఈ పత్రికను వాషింగ్టన్ తో పాటు వైట్ హౌస్ సమీపంలో కొందరు ఉచితంగా పంచిపెట్టారు. వార్తను చదివిన జనాలు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ పత్రిక 2019 మే 1వ తేదీతో ఉంది. దీంతో, ఇది నకిలీ ఎడిషన్ అనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయం కాస్తా వివాదాస్పదంగా మారడంతో... వాషింగ్టన్ పోస్ట్ స్పందించింది. అది నకిలీ ఎడిషన్ అని, దాంతో తమకు సంబంధం లేదని ప్రకటించింది.

More Telugu News