Britain: క్వీన్ ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్!

  • శాండ్రింగ్ హామ్ ఎస్టేట్ సమీపంలో ప్రమాదం
  • పల్టీలు కొట్టిన ఆయన కారు
  • ప్రమాదం లేదన్న రాజకుటుంబ వర్గాలు

బ్రిటన్ రాణి ఎలిజబెత్ భర్త, డ్యూక్ ఆఫ్ ఎడిన్ బర్గ్, ప్రిన్స్ ఫిలిప్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. తూర్పు ఇంగ్లండ్ ప్రాంతంలోని శాండ్రింగ్ హామ్ ఎస్టేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 97 సంవత్సరాల ఫిలిప్ కు ఎటువంటి ప్రమాదమూ కలుగలేదని రాజకుటుంబం అధికారికంగా ప్రకటించింది.

ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న కారు, ఫిలిప్ కారును ఢీకొందని, వారిద్దరికీ స్వల్పగాయాలు కాగా, ఆసుపత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఘటనాస్థలిలో తీసిన చిత్రాలను పరిశీలిస్తే, లాండ్ రోవర్ కారు రోడ్డుపై పల్టీలు కొట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం చాలా భయంకరమైనదని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపినట్టు 'బీబీసీ' వెల్లడించింది.

 ఘటనపై బకింగ్ హామ్ పాలెస్ ఓ ప్రకటన చేస్తూ, డ్యూక్ కు ఎటువంటి గాయాలూ కాలేదని, ఆయన క్షేమమని పేర్కొంది. ముందు జాగ్రత్తగా ఆయన్ను వైద్యులు పరీక్షించారని, శాండ్రింగ్ హామ్ ఎస్టేట్ లోనే ఈ పరీక్షలు జరిగాయని తెలిపింది.

More Telugu News