Hyderabad: హైదరాబాద్ మెట్రోలో ఉద్యోగాలంటూ మోసం.. 161 మంది నుంచి రూ. 80 లక్షలు వసూలు

  • హైకోర్టు న్యాయవాదితో కలిసి ముఠా ఏర్పాటు చేసుకున్న రామకృష్ణ
  • నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు సృష్టి
  • బాధితురాలి ఫిర్యాదుతో ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్ మెట్రో రైలులో ఉద్యోగాల పేరుతో 161 మంది నుంచి రూ. 80 లక్షలు వసూలు చేసిన ముఠా వ్యవహారం గుట్టు రట్టు అయింది. పోలీసుల కథనం ప్రకారం..  ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన వెలగపూడి రామకృష్ణ హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో స్థిరపడ్డాడు. పలు సంస్థల్లో పీఆర్ఓగా పనిచేసిన ఆయన, నిజామాబాద్‌కు చెందిన చిల్ల మహాలక్ష్మి, హైదరాబాద్ ఎస్సార్ నగర్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది గడ్డం శ్రీధర్‌రెడ్డి, మంచిర్యాలకు చెందిన బండారు లక్ష్మణరావులు ఓ ముఠాగా ఏర్పడ్డారు.

హైదరాబాద్ మెట్రో రైలులో ఉద్యోగాలు ఉన్నాయని, వాటిని ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఆశ పెట్టి డబ్బులు దండుకున్నారు. ఏడాది కాలంలో 161 మంది నుంచి రూ. 80 లక్షలు వసూలు చేశారు. రామకృష్ణ ఈ సొమ్ములో రూ. 23 లక్షలు ఖర్చు చేసి నిజామాబాద్‌లోని ఫతేనగర్‌లో మహాలక్ష్మికి ఇల్లు కట్టించాడు. ముఠాలోని మిగతా ఇద్దరు సభ్యులు శ్రీధర్ రెడ్డి, లక్ష్మణరావులకు చెరో పది శాతం వాటా ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు.  

ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో కొత్త దారులు వెతికిన నిందితుడు రామకృష్ణ ఎల్ అండ్ టీ వైస్ ప్రెసిడెంట్ పి.రాధికారెడ్డి పేరుతో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు సృష్టించి ఇచ్చాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటున్న చిత్తూరు జిల్లాకు చెందిన లావణ్య తనకందిన అపాయింట్‌మెంట్ లెటర్‌తో మెట్రో అధికారులను కలవడంతో మోసం వెలుగులోకి వచ్చింది.

మోసపోయిన ఆమె ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రామకృష్ణ, మహాలక్ష్మిలను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీధర్‌రెడ్డి, లక్ష్మణరావు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి కారు, నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు, రూ. 70 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News