Congress: మా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తారా?.. అందుకే అమిత్ షాకు స్వైన్‌ఫ్లూ సోకింది: కాంగ్రెస్ ఎంపీ బీకే హరిప్రసాద్

  • స్వైన్ ఫ్లూ ఏం కర్మ, ఇంకా చాలా వస్తాయి: హరి ప్రసాద్
  • మీ మానసిక రోగానికి చికిత్స లేదు: బీజేపీ మంత్రులు
  • బీజేపీ నేతల అనారోగ్యాన్ని కాంగ్రెస్ కోరుకోదు: ప్రియాంక చతుర్వేది

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు బీకే హరిప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్న కుట్రల ఫలితమే స్వైన్ ఫ్లూ అని పేర్కొన్నారు. గురువారం బెంగళూరులో బీజేపీకి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అదృశ్యమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారని, ఇది చూసి అమిత్ షాకు స్వైన్‌ఫ్లూ సోకిందని ఎద్దేవా చేశారు. కుమారస్వామి ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చూసిన ఎవరికైనా ఒక్క స్వైన్ ఫ్లూనే కాదు.. వాంతులు, విరేచనాలు కూడా అవుతాయని హెచ్చరించారు.

హరిప్రసాద్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మూకుమ్మడి దాడి ప్రారంభించారు. స్వైన్ ఫ్లూకు చికిత్స ఉందని, కానీ మానసిక రోగానికి మందు లేదని కేంద్ర మంత్రులు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్,  ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, పీయూష్‌ గోయల్‌ తదితరులు విరుచుకుపడ్డారు. మంత్రుల విమర్శలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది స్పందించారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఇతరులు మంచిగా ఉండాలనే కోరుకుంటుందని పేర్కొన్నారు. బీజేపీ నేతల అనారోగ్యాన్ని కాంగ్రెస్ కోరుకోదని స్పష్టం చేశారు. అనారోగ్యం పాలైన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ త్వరగా కోలుకోవాలంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ట్వీట్ చేసిన విషయాన్ని ప్రియాంక ఈ సందర్భంగా గుర్తు చేశారు.

More Telugu News