Karnataka: సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న కర్ణాటక రాజకీయాలు.. అదృశ్యమైన ఎమ్మెల్యేలు ప్రత్యక్షం!

  • ఉత్కంఠ రేపుతున్న కన్నడ రాజకీయం
  • అదృశ్యమైన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ముగ్గురు ముంబైలో
  • కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదన్న ఖర్గే

కర్ణాటక రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. క్షణక్షణానికి మలుపులు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏడుగురు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈశ్వరప్ప సోమవారం ప్రకటించినప్పటి నుంచి కన్నడనాట రాజకీయ వేడి రగులుకుంది. ఆయన ప్రకటించిన తర్వాత ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదృశ్యమయ్యారు. వారిలో ముగ్గురు ముంబైలోని ఓ హోటల్‌లో ఉన్నట్టు తేలగా, మిగతా ఇద్దరు ఈ రోజు రాష్ట్రానికి తిరిగొచ్చారు. రాష్ట్రంలో ఆపరేషన్ లోటస్ మొదలైందన్న ప్రచారంతో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.  

కర్ణాటకకు తిరిగి వచ్చిన ఎమ్మెల్యేల్లో ఒకరైన భీమా నాయక్ మాట్లాడుతూ.. సీక్రెట్ ఫోన్ నంబరు ద్వారా బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అయితే, కనిపించకుండా పోయిన ఈ రెండు రోజులు ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని మాత్రం ఆయన బయటపెట్టేందుకు నిరాకరించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలందరితోనూ టచ్‌లోనే ఉన్నామని, మరో రెండు రోజుల్లో పరిస్థితులు సద్దుమణుగుతాయని పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 18న కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశానికి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదన్నారు.

More Telugu News