Andhra Pradesh: జగన్ ఒక్కడే వస్తే 130 సీట్లు.. కేసీఆర్ తో కలిసి వస్తే 160 సీట్లు మావే!: కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు

  • కేసీఆర్ ఫ్రంట్ ఓ కిచిడీ ఫ్రంట్
  • జగన్ తో చర్చలు నిష్ప్రయోజనం
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ అన్నది ఓ కిచిడి ఫ్రంట్ అని టీడీపీ నేత, పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని విమర్శించారు. ప్రధాని మోదీపై దేశ ప్రజలు ఎప్పుడో నమ్మకాన్ని కోల్పోయారని ఎద్దేవా చేశారు. ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా జగన్ తో టీఆర్ఎస్ చర్చలు జరపడం నిష్ప్రయోజనమని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాబోయే ఎన్నికల్లో దేశంలో బీజేపీ అనుకూల, వ్యతిరేక ఫ్రంట్ మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 130 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అదే జగన్ తరఫున కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తే మరో 30 స్థానాలు ఎక్కువగా అంటే 160 సీట్లు గెలుచుకుంటామని జోస్యం చెప్పారు.

లోక్ సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ కేవలం 130 స్థానాలకు పరిమితమవుతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ద్వారా జగన్‌ మోదీకి మద్దతు ఇవ్వబోతున్నారనీ.. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరిట భేటీ అందులో భాగమే అని విమర్శించారు. కేసీఆర్, జగన్ కలిసి ఏపీ రాజకీయాల్లోకి వస్తే టీడీపీ స్వాగతిస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

More Telugu News