Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో భారీ మోసం.. తులసి పంట పేరుతో 1,200 మంది రైతులను ముంచిన విత్తనాల కంపెనీ!

  • వందల ఎకరాల్లో సాగుచేసిన రైతులు
  • పంట కొనేందుకు ముందుకురాని సంస్థ
  • పోలీసులకు ఫిర్యాదుచేసిన రైతన్నలు

నకిలీ విత్తనాలు, ఎరువులతో అల్లాడుతున్న రైతన్నలు కొత్త తరహాలో మోసపోయిన ఘటన ఇది. సంప్రదాయ పంటలు వేయడం కన్నా తులసి పంటను వేస్తే మంచి లాభం వస్తుందని ఓ కంపెనీ నమ్మబలికింది. ఈ పంటను సాగుచేస్తే తామే కొంటామనీ, భారీ లాభాలు వస్తాయని రైతులకు ఆశచూపింది. ఇందుకు సంబంధించిన వీడియోలను చూపుతూ రైతులను బుట్టలో వేసుకుంది. తీరా విత్తనాలు అమ్ముకున్నాక సదరు కంపెనీ దుకాణం ఎత్తేసింది. దీంతో అక్కడి రైతులంతా లబోదిబోమని విలపిస్తున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని అద్దంకి ప్రాంతానికి చెందిన బల్లికురువ, కొరిసిపాడు మండలాల రైతులను జైకిసాన్ అనే ఓ ప్రైవేటు కంపెనీ ప్రతినిధులు కలుసుకున్నారు. తాము అందించే తులసి విత్తనాలను సాగుచేస్తే భారీగా లాభాలు వస్తాయనీ, దీనికి కలుపు బెడద ఉండదని నమ్మించారు. అంతేకాకుండా ఎకరాకు రూ.48,000-రూ.60,000 ఆదాయం వస్తుందని చెప్పారు.

సంవత్సరానికి రెండు సార్లు పంట చేతికి వస్తుందన్నారు. దీంతో సంప్రదాయ పంటలు వేసి నష్టపోయిన దాదాపు 1,200 మంది రైతులు ఇటువైపు మొగ్గుచూపారు. తామే పంటను కొంటామని కంపెనీ ఆశపెట్టడంతో వందల ఎకరాల్లో తులసి పంటను సాగు చేశారు. అయితే పంట చేతికి వచ్చిన సమయానికి అద్దంకిలో కంపెనీ తన ఆఫీసును మూసేసింది. సెల్ ఫోన్ నంబర్లను ప్రతినిధులు మార్చేశారు.

దీంతో ఏం చేయాలో తెలియని రైతులు కంపెనీ ప్రతినిధుల కోసం వెతుకులాట ప్రారంభించారు. చివరికి హైదరాబాద్ లోని ఓ ఇంటిలో సదరు కంపెనీ యజమానిని పట్టుకుని నిలదీయగా, తాము రెండు రోజుల్లో వచ్చి పంటను కొంటామని హామీ ఇచ్చాడు. అయితే ఎకరాకు రూ.20 వేలు మాత్రమే ఇస్తామనీ, రవాణా ఖర్చులన్నీ మీరే పెట్టుకోవాలని బాంబు పేల్చాడు. అయితే ఆ తర్వాత హైదరాబాద్ లోని ఇంటిని సైతం ఖాళీ చేసేశాడు.

దీంతో జైకిసాన్ సంస్థతో పాటు తమను మోసం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు అద్దంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎకరాకు రూ.60,000 నుంచి రూ.70,000 వరకు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

More Telugu News