China: ఖగోళ శాస్త్రంలో మరో ఘనత... చంద్రుడిపై పత్తి విత్తనాన్ని మొలకెత్తించిన చైనా

  • పత్తి, బంగాళాదుంపలను నాటిన రోవర్
  • తొలుత మొలకెత్తిన పత్తి విత్తనం
  • చిత్రాన్ని విడుదల చేసిన చైనా

చైనా మరో ఘనతను సొంతం చేసుకుంది. భూమి పైనుంచి మనకు కనిపించని చంద్రుని వెనుక ప్రాంతానికి మానవ రహిత వ్యోమనౌకను పంపిన చైనా, అక్కడ ఓ విత్తనాన్ని నాటి, దాన్ని మొలిపించింది. పత్తి, బంగాళాదుంప తదితర విత్తనాలను తీసుకెళ్లిన చైనా రోవర్, వాటిని నాటి, 100 రోజుల పాటు వాటిని పరిశీలిస్తూ, ఆ సమాచారాన్ని భూమిపైకి పంపనుంది.

మొక్కలు ఎదిగేందుకు అవసరమైన మట్టి, ఎరువులను సైతం ఈ రోవర్ ఇక్కడి నుంచి తీసుకు వెళ్లింది. భూమి కాకుండా, నివాసయోగ్యమైన మరో గ్రహాన్ని వెతికే మార్గంలో ఇది కీలకమైన పరిణామమని స్పేస్ సైంటిస్టులు వ్యాఖ్యానించారు. ఇతర గ్రహాలకు వెళ్లే వ్యోమగాములకు అవసరమైన ఆహార వనరులను అక్కడే అందించేందుకు జరుగుతున్న పరిశోధనల్లో కీలక అడుగులు పడ్డాయని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వ్యాఖ్యానించింది.

రోవర్ అక్కడ పత్తి విత్తనాలను నాటుతున్న చిత్రాన్ని విడుదల చేసింది. తాము పత్తి విత్తనాలతో పాటు బంగాళాదుంపనూ రోవర్ తో నాటించామని, అయితే, పత్తి విత్తనం తొలుత మొలకెత్తిందని ఈ రీసెర్చ్ ని పర్యవేక్షిస్తున్న ప్రొఫెసర్ లియూ హాన్ లాంగ్ వెల్లడించినట్టు 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' వెల్లడించింది.

More Telugu News