Used Condoms: వాడేసిన కండోమ్ లే అభివృద్ధి... గ్రామస్థుల ప్రశ్నకు ఆర్టీఐ సమాధానం!

  • రాజస్థాన్,  హనుమాన్ గఢ్ జిల్లాలో ఘటన
  • అభివృద్ధిపై ప్రశ్నించిన ఇద్దరు యువకులు
  • సమాధానంగా కండోమ్ పార్శిళ్లు పంపిన వైనం

మన గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏంటో చెప్పాలంటూ ఇద్దరు వ్యక్తులు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి, ప్రశ్నించగా, వారిద్దరికీ ఒకే రకమైన సమాధానం వచ్చింది. దాన్ని చూసి అవాక్కయ్యారు వారు. ఇంతకీ వారికి వచ్చిందేంటో తెలుసా? వాడేసిన కండోమ్ లు. రాజస్థాన్‌ లోని హనుమాన్‌ గఢ్ జిల్లా, భద్ర తహసీల్‌ పరిధిలోని చానీ బడి గ్రామంలో జరిగిందీ ఘటన.

2001 నుంచి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు చెప్పాలంటూ, వికాశ్ చౌదరీ, మనోహర్‌ లాల్‌ అనే ఇద్దరు వేర్వేరుగా ప్రశ్నించారు. వారికి తాజాగా రెండు పార్శిళ్లు అందాయి. తొలుత వికాస్ చౌదరి తన కవర్ విప్పదీయగా, అందులో పేపర్ లో చుట్టిన కండోమ్ లు బయటపడ్డాయి. దీంతో రెండో కవర్ ను విప్పకుండా బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి (బీడీవో)ని, గ్రామ పెద్దలను పిలిపించిన వారు, దాన్ని విప్పాల్సిందిగా కోరారు. అందుకు బీడీవో ఒప్పుకోకపోవడంతో, వీడియో తీస్తూ, పెద్దల సమక్షంలో దాన్ని తెరిచారు. అందులో కూడా వాడిపడేసిన కండోమ్ లే కనిపించాయి. ఈ ఘటనపై హనుమాన్‌ గఢ్ జిల్లా పరిషత్ సీఈవో నవ్‌నీత్ కుమార్‌ స్పందిస్తూ, ఇది ఎవరో కావాలని చేసివుంటారని, విచారించి, నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

More Telugu News