modi: దేశ చరిత్రలోనే అత్యంత సిగ్గుమాలిన చర్యగా ఇది మిగిలిపోతుంది: మోదీ

  • శబరిమల వివాదాన్ని కేరళ ప్రభుత్వం జటిలం చేస్తోంది
  • ప్రపంచంలోని ఐదు బలమైన ఆర్థిక శక్తుల్లో ఒకటిగా భారత్ ను నిలిపాం
  • అగ్రవర్ణ పేదలకు 10 శాతం కోటా తీసుకొచ్చాం

కేరళలోని సీపీఎం ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. శబరిమల వివాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం జటిలం చేస్తోందని... అధికారంలో ఉన్న ఒక ప్రభుత్వం చేపట్టిన అత్యంత సిగ్గుమాలిన చర్యగా ఇది దేశ చరిత్రలో నిలిచిపోతుందని మండిపడ్డారు. ఆధ్యాత్మికత, మతాలను సీపీఎం ప్రభుత్వం పట్టించుకోదనే విషయం తమకు తెలుసని... అయితే సిగ్గుతో తలదించుకునేలా ఇది రూపాంతరం చెందుతుందని ఊహించలేకపోయామని అన్నారు.

లైంగిక సమానత్వం గురించి కాంగ్రెస్, వామపక్షాలు భారీ ప్రసంగాలు ఇస్తాయని... కానీ ఆచరణలో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తాయని ఎద్దేవా చేశారు. ట్రిపుల్ తలాఖ్ ను నిషేధించడానికి తాము ప్రయత్నిస్తుంటే... కాంగ్రెస్, వామపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కోటా తీసుకొచ్చామని చెప్పారు.

కేరళలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న యూడీఎఫ్ (ప్రతిపక్షం) పరిస్థితి కూడా అంతేనని మోదీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి స్థిరమైన అభిప్రాయాలు ఉండవని... శబరిమల వివాదం విషయంలో యూడీఎఫ్ అభిప్రాయం ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కేరళలోని కొల్లాంలో ఈరోజు రెండు ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'అనేక కారణాలతో ప్రాజెక్టులు ఏళ్ల తరబడి కొనసాగుతుండటం, ఆపివేయడం మనం చూశాం. దీని వల్ల ప్రజాధనం, సమయం వృథా అవుతుంది. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనేదే మా అభిమతం. ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తూ, సమస్యలను అధిగమిస్తున్నాం. మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కేవలం 56 గ్రామీణ ప్రాంతాలు మాత్రమే రోడ్లతో అనుసంధానమై ఉన్నాయి. ఇప్పుడు 90 శాతం పైగా మారుమూల ప్రాంతాలను రోడ్లతో అనుసంధానం చేశాం. త్వరలోనే వంద శాతం ఫలితాన్ని రాబడతాం.' అని చెప్పారు.

ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న శక్తిగా భారత్ అవతరిస్తుందని నాలుగేళ్ల క్రితం ఎవరైనా ఊహించారా? అని మోదీ ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో ప్రపంచంలోని ఐదు ఆర్థిక శక్తులలో ఒకటిగా భారత్ ను నిలబెట్టామని ఆయన తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 142వ స్థానం నుంచి 77వ ర్యాంకుకు ఎదిగామని చెప్పారు.

More Telugu News