India: భారత యువతిని అసభ్యంగా తాకిన పాక్ దౌత్యాధికారి.. అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు!

  • రాతపూర్వకంగా క్షమాపణ చెప్పిన దౌత్యాధికారి
  • ఫిర్యాదు చేయకుండా వెళ్లిపోయిన యువతి
  • భారత్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్తాన్

భారత్, పాకిస్తాన్ ల మధ్య దౌత్యాధికారుల విషయంలో ఇప్పటికే గొడవ నడుస్తున్న సంగతి తెలిసిందే. పాక్ రాజధాని ఇస్లామాబాద్ లోని భారత దౌత్యాధికారుల ఇళ్లు, కార్యాలయాలకు విద్యుత్, గ్యాస్ నిలిపివేస్తూ ఆ దేశం ఇబ్బంది పెడుతోంది. తాజాగా ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారే ఘటన చోటుచేసుకుంది. ఓ అమ్మాయిని అసభ్యంగా తాకినందుకు పాకిస్తాన్ కు చెందిన దౌత్యాధికారిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీలోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయంలో షౌకత్ అనే అధికారి నేవల్ అడ్వైజర్ కు సహాయకుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఓ షాపింగ్ మాల్ కు వెళ్లిన షౌకత్.. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ యువతిని అసభ్యంగా తాకాడు. వెంటనే స్పందించిన యువతి అతడి కాలర్ పట్టుకుని పోలీసులకు అప్పగించింది.

దీంతో అతడిని పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చివరికి షౌకత్ రాతపూర్వకంగా సదరు యువతికి క్షమాపణలు చెప్పడంతో ఆమె ఫిర్యాదు ఇవ్వకుండానే వెనుదిరిగింది. కాగా, ఈ ఘటనపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వియన్నా ఒప్పందం ప్రకారం దౌత్యాధికారులను పోలీసులు అదుపులోకి తీసుకోరాదనీ, తాజా చర్యతో భారత్ దాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది.

More Telugu News