Kerala: శబరిమల అయ్యప్పను దర్శించుకుని ఇంటికొచ్చిన దుర్గ.. కోపంతో ఊగిపోతూ చావగొట్టిన అత్త!

  • ఆసుపత్రి పాలైన కనకదుర్గ
  • స్వామివారిని దర్శించుకున్న తొలి మహిళగా రికార్డు
  • ఆసుపత్రిలో చేరిన బాధితురాలు

కేరళలో శబరిమల అయ్యప్పస్వామి ఆలయం వద్ద గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. రుతుస్రావ వయసులో ఉన్న మహిళలు(10-50 ఏళ్ల మధ్య వయసున్నవారు) ఆలయంలోకి వెళ్లవచ్చని సుప్రీంకోర్టు గతేడాది ఇచ్చిన తీర్పుతో చాలామంది స్వామివారిని దర్శించుకునేందుకు యత్నించారు. ఇలా అయ్యప్పను దర్శించుకున్న తొలి మహిళ కనకదుర్గ(39)పై ఈరోజు దాడి జరిగింది. హిందూ సంఘాల బెదిరింపులతో దాదాపు రెండు వారాల పాటు అజ్ఞాతంలో గడిపి, ఈ రోజు తెల్లవారుజామున ఇంటికి చేరుకున్న ఆమెపై అత్త విరుచుకుపడింది.

తాము వెళ్లవద్దని చెప్పినా వినకుండా స్వామిని దర్శించుకున్న కోడలిని చూడగానే ఆమె కోపంతో ఊగిపోతూ దాడిచేసింది. ఓ బలమైన వస్తువుతో తలపై కొట్టింది. దీంతో బాధితురాలు తిరువనంతపురంలోని ఓ ఆసుపత్రిలో చేరింది. బిందు అనే మహిళతో కలిసి ఈ ఏడాది జనవరి 2న కనకదుర్గ గట్టి పోలీస్ భద్రత మధ్య అయ్యప్ప స్వామిని దర్శించుకుంది. దీంతో హిందుత్వ సంఘాలు బెదిరింపులకు దిగడంతో వీరిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా, కనకదుర్గ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

More Telugu News