Hijras: ఆ హిజ్రాలను ఏ జైలులో పెట్టాలి?.. తలలు పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు!

  • రాజస్థాన్ యువకుడిని దోచుకున్న హిజ్రాలు
  • నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • జైలుకు తరలించే ప్రయత్నంలో కష్టాలు

ఓ కేసులో నలుగురు హిజ్రాలు ప్రియ (22), సనం (20), అఫ్రిన్‌(22), యాస్మిన్‌(26)లను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులకు పది గంటలపాటు చుక్కలు కనిపించాయి. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన కైలాశ్ పటేల్ అనే యువకుడు శనివారం రాత్రి జూబ్లీహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడిని చూసిన ఐదుగురు హిజ్రాలు దగ్గరికి వెళ్లి మాటలు కలిపారు.

ఆ తర్వాత కాసేపటికే యువకుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని హిజ్రాలు తన దగ్గరున్న డబ్బులను బలవంతంగా లాక్కున్నారని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం ఉదయం నలుగురు హిజ్రాలను అదుపులోకి తీసుకోగా, సిమ్రాన్ ఫాతిమా (20) తప్పించుకుంది. హిజ్రాలను అదుపులోకి తీసుకున్న పోలీసులకు అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి.

వారిని సోమవారం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారిని రిమాండ్‌కు ఆదేశించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీరిని చూసిన జైలు అధికారులు వారు మహిళలని, కాబట్టి తాము అనుమతించబోమని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు మరోమారు కోర్టును ఆశ్రయించారు. ఈసారి వారికి కోర్టు షాకిచ్చింది. తాము రిమాండ్‌కు మాత్రమే ఆదేశించామని, ఎక్కడికి తరలిస్తారో మీ ఇష్టమంటూ తేల్చి చెప్పింది. ఇలా లాభం లేదనుకున్న పోలీసులు వారిని మహిళా జైలుకు తీసుకెళ్లారు.

ఈసారి పోలీసులకు మరో చిక్కొచ్చి పడింది. వారు పురుషులో, మహిళలలో తెలుసుకునేందుకు వైద్య ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని జైలు అధికారులు కోరారు. హిజ్రాలను పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. వారు ఆపరేషన్ చేయించుకుని మహిళలుగా (ట్రాన్స్‌జెండర్స్) మారిన వారని వైద్యులు నిర్ధారించారు. ఆ ధ్రువీకరణ పత్రాన్ని చంచల్‌గూడ మహిళా జైలర్‌కు ఇవ్వడంతో అప్పుడు వారిని అనుమతించారు. ఇలా మొత్తం పది గంటలపాటు జూబ్లీహిల్స్ పోలీసులు కష్టాలు పడాల్సి వచ్చింది.

More Telugu News