Jagan: ఇడుపులపాయలో జగన్ తో కావలి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి రహస్య చర్చలు!

  • కావలిలో వేడెక్కిన రాజకీయం
  • నేతల వరుస భేటీలపై ప్రజల్లో చర్చ
  • టికెట్ విషయమై జగన్ తో చర్చించిన విష్ణు

కావలి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి నిన్న ఇడుపులపాయకు వెళ్లి, వైఎస్ జగన్ తో రహస్యంగా చర్చించడం ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. నెల్లూరు జిల్లా వైసీపీ ఇన్ చార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణలు ఆ సమయంలో అక్కడే ఉండగా, విష్ణు, జగన్ లు చాలాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య ఏం చర్చలు జరిగాయన్న విషయమై అధికారికంగా ఎటువంటి వార్తా బయటకు రాకపోయినా, కావలి టికెట్ విషయంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు వైకాపా వర్గాలు అంటున్నాయి.

ఇక జగన్, విష్ణుల చర్చల విషయం తెలియగానే, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్వయంగా బావ అయిన రామకోటారెడ్డి ఇంటికి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు తమ అనుచరులతో కలసి వెళ్లి, అక్కడే భోజనం చేయడం గమనార్హం. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో కావలి ప్రాంతంలో రాజకీయ వాతావరణం ఈ రెండు భేటీలతో మరింతగా వేడెక్కింది.

కాగా, తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుంటే, అనుచరులతో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటానని విష్ణువర్ధన్ రెడ్డి, జగన్ వద్ద స్పష్టం చేసి వచ్చారని అనుయాయులు అంటున్నారు. జగన్ ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారని కూడా ప్రచారం జరుగుతోంది.

More Telugu News