Pawan Kalyan: నాకు ఓటేస్తే.. కంఠం కోసి ఇవ్వడానికైనా సిద్ధం!: పవన్ కల్యాణ్

  • రానున్న ఎన్నికలు జనసేనకు మొదటివీ కావు, చివరివీ కావు
  • తెలంగాణ యువత స్ఫూర్తితో ఏపీ యువత ఉద్యమాలు చేయాలి
  • పెదరావూరు బహిరంగ సభలో పవన్ పిలుపు

రానున్న ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపిస్తే కంఠం కోసివ్వడానికైనా సిద్ధమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని పెదరావూరులో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థ ఏదైనా అవినీతి సాధారణంగా మారిందన్న పవన్.. దానిని భోగి మంటల్లో వేసి దహనం చేయాలన్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులను ప్రశ్నించాలని యువతకు పిలుపునిచ్చారు. తనకు ఓటేసి గెలిపిస్తే మెడ కోసి ఇవ్వడానికైనా సిద్ధమని పేర్కొన్నారు.  

ప్రజలకు కావాల్సింది రూ. 2 వేల పింఛను, 25 కిలోల బియ్యం కాదని, పాతికేళ్ల బంగారు భవిష్యత్తని స్పష్టం చేశారు. దేశానికి వెన్నెముకలాంటి రైతులు ఇక కష్టపడడానికి వీల్లేదన్నారు. వచ్చే నెల 2న రైతులతో సమావేశమై వారి కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించి జనసేన మేనిఫెస్టోలో చేరుస్తామన్నారు. ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసుకునేందుకు అక్కడి యువత రోడ్ల మీదకు వచ్చి పోరాడారని, అదే స్ఫూర్తితో ఏపీ యువత కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికలు జనసేనకు మొదటివీ కావు, ఆఖరివీ కావని జనసేనాని పవన్ స్పష్టం చేశారు.

More Telugu News