Telangana: తెలంగాణలో కొత్త తలనొప్పి.. ఈ నెల 17 నుంచి ‘మీ సేవా’ కేంద్రాల మూత!

  • నిరవధిక సమ్మెకు దిగుతున్న నిర్వాహకులు
  • చాలీచాలని ఆదాయంపై ఆందోళన
  • కమీషన్ పెంచాలని డిమాండ్

త్వరలోనే లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణలో మీ సేవా కేంద్రాలు మూతపడనున్నాయి. ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని మీసేవా నిర్వాహకుల సంక్షేమ కమిటీ పిలుపునిచ్చింది. ఈ విషయమై తెలంగాణ కమిటీ సభ్యుడు ఒకరు స్పందిస్తూ.. చాలీచాలని ఆదాయంతో మీసేవా కేంద్రాల నిర్వహణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లో తాము సమ్మెబాట పడుతున్నామని స్పష్టం చేశారు. అందిస్తున్న సేవలకు నామమాత్రంగా కమీషన్ అందిస్తున్నారని వాపోయారు.

తెలంగాణలో ఇప్పటివరకూ 11,054 మీసేవా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఆదాయం తగినంతగా లేకపోవడంతో దాదాపు 2,000కుపైగా మీ సేవా సెంటర్లు మూతపడ్డాయి. ప్రస్తుతం తెలంగాణలో 9,020 కేంద్రాలు మాత్రమే సేవలు అందిస్తున్నాయి. ఏపీ ఆన్‌లైన్, శ్రీవెన్, రామ్‌ ఇన్‌ఫో, కార్వీ, సీఎంఎస్‌ వంటి కంపెనీలు వీటికి సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా కేటగిరీ–ఏ సేవలకు రూ.11 నుంచి రూ.12.90 ఇస్తుండగా, కేటగిరీ–బి సేవలకు రూ.17 నుంచి రూ.18.50 వరకూ ఇస్తున్నారు.

అయితే కొన్ని కంపెనీలు దీనికంటే తక్కువ కమిషన్ చెల్లిస్తున్నాయి. పైగా కమీషన్‌లో మీసేవ కేంద్రాలు జారీ చేసే ప్రతి సర్టిఫికేట్‌కు రూ.1.50, టీడీఎస్, జీఎస్‌టీ కింద 18 శాతం మినహాయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాము సమ్మెబాట పడుతున్నట్లు మండల అధికారులకు నోటీసులు అందించామన్నారు. కాగా సమ్మె త్వరగా ముగియకపోతే ఓటర్ కార్డుల జారీ సహా పలు ప్రభుత్వ సేవలకు తీవ్రమైన ఇబ్బంది కలిగే అవకాశముంది.

మీ సేవ నిర్వాహకుల డిమాండ్లు ఇవే..
1)వివిధ సేవలకు చెల్లించే కమీషన్‌ పెంచాలి.
2) అప్లికేషన్‌ స్కానింగ్‌ను రూ.2 నుంచి రూ.5కు పెంచాలి.
3)18 శాతం వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ)ను రద్దు చేయాలి.
4) విద్యుత్‌ కనెక్షన్‌ను కేటగిరీ–2 నుంచి ప్రత్యేక కేటగిరీకి మార్చాలి.
5)ఆధార్‌ కేంద్రాలను అన్ని మీసేవ కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకురావాలి.

More Telugu News