Hyderabad: హైదరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో నిఘా నేత్రాలు.. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు!

  • నగర పరిధిలోని 63 స్టేషన్ల పరిధిలో అమలు
  • కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంతో అనుసంధానం
  • నేరాలు, ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం లక్ష్యం

హైదరాబాద్‌ నగరంలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల ప్రాంతాలను సీసీ కెమెరాల పరిధిలోకి తెచ్చేందుకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చి, స్టేషన్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం (పోలీస్‌ ఠానా వీక్షణ కేంద్రం`పీఎస్‌వీసీ)తో అనుసంధానించాలని నిర్ణయించారు. నేర నియంత్రణ, ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించేందుకు సీసీ కెమెరాల సహాయంతో కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచే అనుక్షణం నిఘా కొనసాగించనున్నారు.

గత ఏడాది ప్రయోగాత్మకంగా కొన్ని స్టేషన్ల పరిధిలో అమలు చేసిన విధానం సత్ఫలితాలు ఇవ్వడంతో అన్ని స్టేషన్లకు దీన్ని విస్తరించాలని నిర్ణయించారు. అదే సమయంలో వ్యక్తులు, వ్యాపారులు, సంస్థలు సొంతంగా ఏర్పాటు చేసుకున్న కెమెరాలను కూడా తమ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం పరిధిలోకి తేవాలని నిర్ణయించారు. జియో ట్యాగింగ్‌ ద్వారా దీన్ని అమలు చేస్తారు. కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం సిబ్బంది 24 గంటలపాటు విధుల్లో ఉంటారు. అంటే అనుక్షణం సీసీ కెమెరాల పరిధిలోని ప్రాంతాలపై నిఘా ఉంటుంది.

అన్ని సీసీ కెమెరాలకు జియోట్యాగింగ్‌ చేయడం వల్ల వాటి పనితీరు, సరిహద్దు, విభజన రేఖలు స్పష్టంగా తెలిసే వీలుంటుందని భావిస్తున్నారు. వాహనాల రాకపోకలు, వర్షాలు కురిసేటప్పుడు పరిస్థితులు, ఘర్షణలు చోటు చేసుకునేటప్పుడు ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుని తక్షణ నిర్ణయం తీసుకునే అవకాశం దీనివల్ల కలుగుతుందని పోలీసులు భావిస్తున్నారు.

More Telugu News