Telangana: సర్పంచ్ ఎన్నికల్లో నిలబడాలని భర్త ఒత్తిడి... తట్టుకోలేక యువతి ఆత్మహత్య!

  • ఎన్నికల ఖర్చును పుట్టింటి నుంచి తేవాలని వేధింపులు
  • పురుగుల మందు తాగి యువతి మృతి
  • నల్గొండ జిల్లాలో ఘటన

తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఓ యువతి బలవన్మరణానికి కారణమయ్యాయి. సర్పంచ్ గా పోటీ చేయాలని, అందుకోసం పుట్టింటి నుంచి రూ. 5 లక్షలు తీసుకురావాలని భర్త వేధిస్తుండటంతో, మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, నల్గొండ జిల్లా డిండి మండలం, నిజాంనగర్‌ కు చెందిన భైరాపురం రాధ (22)కు ఎర్రగుంటపల్లికి చెందిన జంతుక లింగమయ్యకు ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది.

త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎర్రగుంటపల్లిని ఎస్సీ మహిళకు కేటాయించడంతో, పోటీ చేయాలంటూ రాధపై ఒత్తిడి తెచ్చాడు లింగమయ్య. ఎన్నికల ఖర్చు కోసం రూ. 5 లక్షలు తేవాలని వేధించాడు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో ఆమె పురుగుల మందు తాగింది. ఆమెను తొలుత దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి,  ఆపై హైదరాబాద్ కు చికిత్స నిమిత్తం తరలించినా ఫలితం దక్కలేదు. రాధ మరణంపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించినట్టు పోలీసులు వెల్లడించారు.

More Telugu News