jagan: జగన్ పై దాడి కేసు విచారణ.. కేంద్ర నిర్ణయంపై మండిపడుతూ మోదీకి లేఖ రాసిన చంద్రబాబు

  • జగన్ కేసును ఎన్ఐఏకి అప్పగించడం దారుణం
  • విదేశీ శక్తుల ప్రమేయం ఉండే క్లిష్టమైన కేసులను మాత్రమే ఎన్ఐఏకి అప్పగించాలి
  • గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్ఐఏ చట్టాన్ని మోదీ వ్యతిరేకించారు

విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తితో జరిగిన దాడి విచారణను ఎన్ఐఏకి అప్పగించిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఎన్ఐఏ చట్టంలోని పలు అంశాలను లేఖలో ఆయన ప్రస్తావించారు. విదేశీ శక్తుల ప్రమేయం ఉండే క్లిష్టమైన కేసులను మాత్రమే ఎన్ఐఏకి అప్పగించాలని తెలిపారు. దేశ భద్రత, ఆయుధాలు, డ్రగ్స్ కేసులను మాత్రమే ఎన్ఐఏ చూస్తుందని గుర్తు చేశారు.

'గత డిసెంబర్ 25న విశాఖ విమానాశ్రయంలో జగన్ పై జరిగిన దాడి కేసును ఎన్ఐఏకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దారుణం. ఇప్పటికే ఈ కేసును రాష్ట్ర అధికారులు విచారిస్తున్నారు. ఎన్ఐఏ చట్టం 2008 ప్రకారం అంతర్ రాష్ట్ర, అంతర్జాతీయ లింకులు ఉన్న క్లిష్టమైన కేసులను మాత్రమే ఎన్ఐఏ విచారించాలి. డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్, ఫేక్ కరెన్సీ చలామణి, సరిహద్దుల గుండా అక్రమ చొరబాట్లు తదితర అంశాలను మాత్రమే ఎన్ఐఏ చూసుకోవాలి. 2008లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ఐఏ చట్టాన్ని మోదీ వ్యతిరేకించారు. ఇప్పుడు అదే చట్టాన్ని అనుసరిస్తూ జగన్ పై దాడికి సంబంధించిన కేసును ఎన్ఐఏకి అప్పగించారు. వ్యక్తిగత కేసును కూడా ఎన్ఐకే అప్పగించడం దారుణం' అంటూ లేఖలో చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

More Telugu News