Uttar Pradesh: యూపీలో ఎస్పీ-బీఎస్పీల మధ్య కుదిరిన పొత్తు.. చెరో 38 లోక్ సభ స్థానాల్లో పోటీకి నిర్ణయం!

  • కాంగ్రెస్ కు రెండు స్థానాలు విడిచిపెట్టిన కూటమి
  • మిత్రపక్షాలకు మరో రెండు స్థానాలు కేటాయింపు
  • లక్నోలో అఖిలేశ్-మాయావతి మీడియా సమావేశం

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో చెక్ పెట్టేందుకు యూపీలోని ప్రధాన పక్షాలు పొత్తు కుదుర్చుకున్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఉత్తరప్రదేశ్ లో ఉప్పు-నిప్పుగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) జట్టుకట్టాయి. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 80 స్థానాలకు గానూ చెరో 38 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించాయి.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోనప్పటికీ అమేథీ(రాహుల్ గాంధీ), రాయ్ బరేలీ(సోనియా గాంధీ) స్థానాల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశాయి. మిగిలిన రెండు స్థానాలను మిత్రపక్షాలకు కేటాయిస్తామని పేర్కొన్నాయి. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతి యూపీ రాజధాని లక్నోలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను ప్రకటించారు.

ఈ సందర్భంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ..‘ఈ కూటమితో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిద్రలేని రాత్రులు గడపబోతున్నారు. కాంగ్రెస్ విధానాల కారణంగానే మాలాంటి పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. కాంగ్రెస్ లేదా బీజేపీ.. ఎవరు అధికారంలోకి వచ్చినా తేడా ఏమీ లేదు. కాంగ్రెస్ తో జతకట్టడం వల్ల మాకు పెద్దగా ప్రయోజనం లేదు. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకే మేం ఈ పొత్తు పెట్టుకోలేదు. దేశంలోని సామాన్యులు, దళితులు, మైనారిటీల హక్కులను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. దేశ ప్రయోజనాల కోసం విభేదాలను, గెస్ట్ హౌస్ గొడవను పక్కనపెట్టి మేం చేతులు కలపాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు.

ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ..‘మాయావతి గారిని అవమానిస్తే.. నన్ను వ్యక్తిగతంగా అవమానించినట్లే’ అని సమాజ్ వాదీ కార్యకర్తలను పరోక్షంగా హెచ్చరించారు. దాదాపు 25 ఏళ్ల  క్రితం లక్నోలోని ఓ గెస్ట్ హౌస్ లో మాయావతిపై సమాజ్ వాదీ కార్యకర్తలు దాడిచేశారు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని మాయావతి తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది యూపీలోని గోరఖ్ పూర్ సహా మూడు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ఈ నేపథ్యంలో విపక్ష కూటమి అనే ఆలోచన మొగ్గతొడిగింది.

More Telugu News