Hyderabad: పచ్చని జీవితంలో నిప్పులు పోసిన సెల్‌ఫోన్ చాటింగ్!

  • భార్య చాటుమాటు చాటింగ్‌తో మనస్తాపం
  • ప్రశ్నించడంతో పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
  • మనస్తాపంతో భర్త ఆత్మహత్య
  • అనాథగా మారిన ఏడాది బాలుడు

వాట్సాప్ మెసేజ్‌లు, చాటింగ్‌లు పచ్చని జీవితంలో నిప్పులు పోశాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు కారణమయ్యాయి. ప్రేమించి పెళ్లాడిన వారిలోని ప్రేమను దూరం చేశాయి. నెలలు నిండని పసివాడికి తండ్రిని దూరం చేశాయి. హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం..కడప జిల్లా పులివెందుల సమీపంలోని గోటూరుకు చెందిన ఎర్రగొండు చరణ్‌తేజ్ రెడ్డి (25) ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌లోని చింతల్ వచ్చి బంధువుల నర్సరీలో పనిచేస్తున్నాడు. అదే నర్సరీలో పనిచేస్తున్న విజయనగరానికి చెందిన పావనితో చరణ్‌కు పరిచయం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమకు దారితీసింది. రెండేళ్ల క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు.

గత కొంతకాలంగా భార్య సెల్‌ఫోన్‌కు తరచూ మెసేజ్‌లు వస్తుండడం, ఆమె రహస్యంగా చాటింగ్ చేస్తుండడాన్ని చూసిన చరణ్ ఆమెను ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో పావని కుమారుడిని భర్త వద్దే వదిలేసి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. భార్య తనను విడిచి వెళ్లిపోవడం, కుమారుడిని చూసుకోవాల్సి రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చరణ్ గురువారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

శుక్రవారం తెల్లవారుజామున చిన్నారి ఆగకుండా ఏడుస్తుండడంతో ఇరుగుపొరుగువారు గమనించి ఇంట్లోకి వెళ్లారు. అక్కడ చరణ్ సీలింగుకి వేలాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే వారు పావనికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆమె నమ్మకపోవడంతో చరణ్ మృతదేహాన్ని ఫొటో తీసి వాట్సాప్ చేశారు. అయినప్పటికీ ఆమె శుక్రవారం సాయంత్రానికి గానీ స్పందించలేదు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక, తల్లిదండ్రులు ఇద్దరూ కనిపించకపోవడంతో ఆ చిన్నారి గుక్కపట్టి ఏడుస్తున్నాడు. తల్లి రాకపోవడంతో ఇరుగుపొరుగువారే బాబును చేరదీశారు.

More Telugu News