Jayalalita: కొడనాడు హత్యల మిస్టరీ.. సీఎం పళనిస్వామిపై నిందితుడి సంచలన ఆరోపణలు

  • జయ కొడనాడు ఎస్టేట్‌లో దోపిడీ  
  • దోపిడీ దొంగలు ఒక్కొక్కరుగా మృతి
  • సీఎం హస్తం ఉందని ఆరోపణ

తమిళనాడులోని నీలగిరి జిల్లా కొడనాడులోని మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎస్టేట్‌లో జరిగిన అనుమానాస్పద మృతుల కేసు నిందితుడు సయాన్ సంచలన ఆరోపణలు చేశాడు. కేరళకు చెందిన సయాన్ తెహల్కా మాజీ ఎడిటర్ మాథ్యూ శామ్యూల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించాడు. తెహల్కా విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ హత్యల మిస్టరీ వెనక ముఖ్యమంత్రి పళనిస్వామి హస్తం ఉందని సయాన్ ఆరోపించాడు.

కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన దోపిడీలో వాచ్‌మన్ మృతి చెందగా, ఈ కేసులో అరెస్ట్ అయిన జయలలిత మాజీ కారు డ్రైవర్ కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇక, మరో నిందితుడైన సయాన్ కేరళలో తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా జరిగిన ప్రమాదం నుంచి బయటపడినా, ఆయన భార్య విష్ణుప్రియ, కుమార్తె మృతి చెందారు. కొడనాడు ఎస్టేట్‌లో సీసీటీవీ కెమెరాలను పరిశీలించే యువకుడు ఒకరు ఉరేసుకుని మరణించాడు. ఈ మొత్తం మరణాల వెనుక ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రమేయం ఉందని ఇంటర్వ్యూలో సయాన్ ఆరోపించాడు. కాగా, ఈ వీడియోపై తమిళ మంత్రి జయకుమార్ స్పందించారు. నిందితుడిని ఇంటర్వ్యూ చేసిన మాథ్యూ శామ్యూల్‌‌పై కేసు వేయనున్నట్టు తెలిపారు.

More Telugu News