Andhra Pradesh: రాబోయే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తాం.. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ తో ప్రయోజనముండదు!: సీపీఎం నేత మధు

  • ఈ నెల 18,19,20న చర్చలు జరుపుతాం
  • ఉత్తరాంధ్రలో 30 వేల మంది వలస కూలీలయ్యారు
  • విశాఖలో మీడియాతో మాట్లాడిన నేత

రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి వామపక్షాలు పోటీ చేస్తాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో ఓ ప్రత్యామ్నాయాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ పోటీ చేయాలో జనసేన, సీపీఎం, సీపీఐ కూర్చుని చర్చించి నిర్ణయం తీసుకుంటాయని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మధు మాట్లాడారు.

ఈ నెల 18, 19, 20 వ తేదీల్లో ఏ నియోజకవర్గం నుండి ఎవరు పోటీ చేయాలనే దానిపై సమావేశమై చర్చిస్తామని మధు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా ఫ్యాక్టరీలు మూతబడ్డాయని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్రలో సుమారు 30,000 మంది ప్రజలు వలస కూలీలుగా మారారని దుయ్యబట్టారు. గిరిజన ప్రాంతాల్లో భారీగా సాగుతున్న మైనింగ్ పై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న ఫెరడల్ ఫ్రంట్ వల్ల ప్రయోజనం ఉండదని తేల్చిచెప్పారు. 11 కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు రూ.12,000 కోట్లు ఇస్తామన్న కేంద్రం కేవలం రూ.820 కోట్లు ఇచ్చి సరిపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే విభజన హామీలు నెరవేరడానికి మరో 30 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చారని మధు తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో దళితులు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారనీ, అందుకే ప్రధాని మోదీ అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించారని ఆరోపించారు.

More Telugu News