YSRCP: జగన్‌కు ప్రజాపాలనపై కాదు...సీఎం కుర్చీపై వ్యామోహం: తులసిరెడ్డి విసుర్లు

  • ఆయన అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రాక్షస పాలన
  • జగన్‌ తాత రాజారెడ్డి హయాం వస్తుంది
  • అవినీతి ఇతర గ్రహాలకు విస్తరిస్తుంది

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు. గతంలో విశాఖ విమానాశ్రయంలో కత్తితో దాడి సంఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన తాజాగా జగన్‌ పాదయాత్ర తదితర అంశాలపై స్పందించారు. జగన్‌కు రాష్ట్ర ప్రజల సంక్షేమం, పాలనపై ఆసక్తిలేదని, సీఎం కుర్చీపై వ్యామోహమని ధ్వజమెత్తారు.

ఆయన అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రాక్షసపాలన వస్తుందన్నారు. అవినీతి ఇతర గ్రహాలకు కూడా విస్తరిస్తుందన్నారు. ఇప్పటికే ఎంపీ టికెట్‌ రూ.100 కోట్లకు, ఎమ్మెల్యే టికెట్‌ రూ.30 కోట్లకు వేలం పెట్టి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. జగన్‌ సీఎం అయితే ఆయన తాత రాజారెడ్డి నాటి పరిస్థితులు రాష్ట్రంలో పునరావృతం అవుతాయని చెప్పారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై జగన్‌ది ప్రేమ కాదని, ఆ రాష్ట్రంలోని తన ఆస్తులను కాపాడుకునే ఎత్తుగడ అన్నారు. అందుకే తన తండ్రి వైఎస్‌ను కేసీఆర్‌ నోటికొచ్చినట్లు తిడుతున్నా జగన్‌ ఆయన పట్ల సానుకూలంగా ఉన్నట్లు నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ పాదయాత్ర గురించి ఆ పార్టీ నేతలు చంకలు గుద్దుకుని గొప్పలు చెబుతున్నారని, కానీ నాలుగు ముద్దులు, సెల్ఫీలు తప్ప అందులో ఏముందని ప్రశ్నించారు. రోజుకి రూ.2 కోట్లు ఖర్చుచేసి ఏడాదికి పైగా జగన్‌ కష్టపడినా పాదయాత్రకు ప్రజల నుంచి ఆశించిన స్పందన కానరాలేదన్నారు.

More Telugu News