Au: ఏయూ వేదికపై గవర్నర్ గరం.. మంత్రి గంటా వ్యాఖ్యలను ఖండించిన నరసింహన్!

  • ఏయూ స్నాతకోత్సవంలో ఘటన
  • ప్రైవేటు వర్శిటీలతో ప్రభుత్వ వర్శిటీలు పోటీ పడాలన్న గంటా
  • ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారన్న నరసింహన్

ఆంధ్రా యూనివర్శిటీ స్నాతకోత్సవం ఉత్సాహంగా సాగుతున్న వేళ, మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను వేదికపైనే ఖండించారు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్. "ప్రభుత్వ యూనివర్శిటీలు ప్రైవేట్ యూనివర్శిటీలతో పోటీ పడాలి. రాష్ట్రానికి ఎన్నో ప్రముఖ ప్రైవేటు వర్శిటీలు వస్తున్నాయి. వాటితో పోటీ పడుతూ ప్రభుత్వ వర్శిటీలు ఎదగాలి" అని వ్యాఖ్యానించారు. ఆపై గవర్నర్ మాట్లాడుతూ మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయవద్దని ఒకింత గట్టిగానే అన్నారు. ప్రైవేటు వర్శిటీలతో ప్రభుత్వ వర్శిటీలు పోటీపడలేవని చెప్పారు.

వర్శిటీలలో నియామకాలకు, పదోన్నతులకు పీహెచ్డీ నిబంధన పెట్టడంతో, ఎంతో మంది ఆసక్తి లేకుండానే పీహెచ్డీలు చేసేస్తున్నారని, ఒక ఆచార్యుడు ఒకేసారి ఎంతో మందితో పీహెచ్డీలు చేయించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించిన నరసింహన్, పరిశోధనలు సమాజానికి ఉపయుక్తకరం కావడం లేదని అన్నారు. పీహెచ్డీలను డిగ్రీలుగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, వైద్య రంగంలో ప్రైవేటు ఆసుపత్రులకు ప్రాధాన్యం ఇవ్వడంతో, గవర్నమెంట్ హాస్పిటల్స్ నిర్వీర్యం అయ్యాయని, విద్యా వ్యవస్థకు ఆ దయనీయ స్థితి రానీయవద్దని సూచించారు.

  దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. కాగా, ఏయూ స్నాతకోత్సవంలో 546 మందికి డాక్టరేట్ లు, ఆరుగురికి ఎంఫిల్ డిగ్రీలను అందించారు. ఇదే సమయంలో ఆచార్య రామ్ గోపాల్ రావుకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు.

More Telugu News