అమెరికా లైట్‌హౌస్‌లో ఉద్యోగం.. ఇద్దరు ఉద్యోగులకు రూ. 91.6 లక్షల ఆఫర్!

10-01-2019 Thu 09:14
  • సముద్ర తీరంలో చారిత్రక లైట్ హౌస్
  • రెండు ఖాళీల భర్తీకి ప్రకటన
  • కపుల్స్‌కే తొలి ప్రాధాన్యం
అమెరికాలోని ద్వీపం ఒకటి బ్రహ్మాండమైన ఉద్యోగం ఆఫర్ చేస్తోంది. శాన్‌ఫ్రాన్సిస్కో సముద్ర తీరంలో ఉన్న చారిత్రక లైట్ హౌస్‌ను చూసుకోగలిగే ఉద్యోగం కోసం ఏకంగా 91.6 లక్షలను వేతనంగా ఆఫర్ చేస్తోంది. ఈ వేతనం ఇద్దరు ఉద్యోగుల కోసం ఉద్దేశించినది. దీనిని ఇద్దరికీ సమానంగా పంచుతారు. లైట్‌హౌస్ నిర్వహణ, ఆహార సరఫరా, అతిథులను మెయిన్‌ల్యాండ్ నుంచి ఐలాండ్‌కు తీసుకెళ్లడం, తీసుకురావడం వంటి పనులు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ లైట్‌హౌస్‌ను 1874లో నిర్మించారు. 1960లలో ఆధునికీకరించారు.  

ఉద్యోగార్థులు భార్యాభర్తలైతే మరింత బాగుంటుందని ఈస్ట్ బ్రదర్ లైట్ స్టేషన్ తన ప్రకటనలో పేర్కొంది. రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయని, జంటలకే తమ మొదటి ప్రాధాన్యం అని వివరించింది. ఇద్దరి కోసం కేటాయించే గది చిన్నదే అయినా, రెండేళ్లపాటు కావాల్సినంత సమయాన్ని ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చని పేర్కొంది. యూఎస్ కోస్ట్‌గార్డు లైసెన్స్ తప్పనిసరి అని తెలిపింది. ఇది నిస్సందేహంగా అద్భుతమైన ఉద్యోగమని వివరించింది.