EBC 10% Reservations: అదే జరిగితే ఇది మరో పెద్ద నోట్ల రద్దు పథకం అవుతుంది: కపిల్ సిబాల్ సెటైర్లు

  • ఈబీసీ రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో చర్చ
  • ఈ బిల్లు తెస్తున్న విధానం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం
  • ఈబీసీ రిజర్వేషన్లకు అర్హులను ఎలా నిర్ణయిస్తారు?

ఈబీసీ రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో ఈరోజు చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ కపిల్ సిబాల్ మాట్లాడారు. ఈ బిల్లుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు. రాజ్యసభలో సిబాల్ మాట్లాడుతూ, ‘ఈ బిల్లు రాజ్యాంగ సమ్మతమేనన్న న్యాయ అభిప్రాయం చెప్పింది ఎవరు? అని కపిల్ సిబాల్ ధ్వజమెత్తారు. ఈ బిల్లు తీసుకొస్తున్న విధానం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు.

ఈ దేశంలో 76 లక్షల మంది ప్రజలు రూ.5 లక్షలకు మించి ఆదాయం కలిగి ఉన్నారని, అందులో 40 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారన్న విషయం ఆదాయ పన్ను శాఖ లెక్కలు చెబుతున్నాయని అన్నారు. అలాంటప్పుడు, ఈబీసీ రిజర్వేషన్లకు అర్హులను ఎలా నిర్ణయిస్తారు? వాస్తవంగా ఎంతమంది అర్హులో ఎలా చెబుతారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈ క్రమంలో నకిలీ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కూడా పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని, ఆదాయ ధ్రువీకరణకు సంబంధించి ప్రత్యేక వ్యవస్థ ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ప్రకారం వంద శాతం ప్రజలు ఈ బిల్లు పరిధిలోకి వస్తారని, అదే జరిగితే ఇది మరో పెద్ద నోట్ల రద్దు పథకం అవుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గ్రామీణ ప్రాంతాల్లో 8.2 శాతం ప్రజలకు మాత్రమే రూ.10 వేలకు మించి ఆదాయం ఉందని, ఈ బిల్లులో రాజ్యాంగ పరమైన అనేక అంశాలు ఇమిడి ఉన్నాయని, ఈ బిల్లు ఎలా నిలుస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉందని సిబాల్ అభిప్రాయపడ్డారు.

More Telugu News