YSRCP: పద్నాలుగు నెలలు పేదవాడితోనే ఉన్నా.. పొద్దున్న లేస్తే కష్టాలే విన్నా: వైఎస్ జగన్

  • నాకు డబ్బుపై వ్యామోహం లేదు
  • ప్రజలకు సేవ చేయాలన్నదే నా తపన
  • ఒక్కసారి అధికారంలో కొస్తే ముప్పై ఏళ్లు పాలించాలి
  •  అదే నా సంకల్పం

తనకు డబ్బుపై వ్యామోహం లేదని, ప్రజలకు సేవ చేయాలన్నదే తన తపన అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఒక్కసారి అధికారంలోకొస్తే ముప్పై ఏళ్లు పాలించాలన్నది తన సంకల్పమని జగన్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆయన ప్రజా సంకల్ప యాత్ర ముగిసింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘మూడు వేల ఆరువందల కిలోమీటర్లకు పైగా నడిచాను. ప్రతి పేదవాడి కష్టాన్ని చూశాను. ప్రతి పేదవాడి పరిస్థితిని ఎలా మెరుగు పరచాలన్న ఆలోచనలతోనే ఈ పద్నాలుగు నెలల సమయం గడిచిపోయింది. ఒక సామెత ఎప్పుడూ అంటూ ఉంటారు.. ‘ఆర్నెల్లు సావాసం చేస్తే వాళ్లు వీళ్లవుతారు..వీళ్లు వాళ్లవుతారు’ అని.

గత పద్నాలుగు నెలలు పేదవాడితోనే ఉన్నా. పొద్దున్న లేస్తే కష్టాలే విన్నా. పొద్దున్నలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా పేదవాడి కష్టాలు వింటూనే.. వారికి తోడుగా వుంటూనే, వారికి భరోసా ఇస్తూనే నడిచా. రాష్ట్రంలోని ప్రతి సమస్య మీద పూర్తి అవగాహనతో ఇవాళ ఉన్నానని అందరికీ గట్టిగా చెప్పగలుగుతున్నా. ఈ అవగాహనతో నేను ఉన్నాను.

 ప్రతి పేదవాడికి మంచి చేయాలన్న తపన, ఆలోచన నాలో ఉన్నాయి కాబట్టి, మీ అందరినీ ఒకటే కోరుతున్నా.. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మారుస్తాం, తోడుగా కలిసి రమ్మనమని మీ అందరినీ అడుగుతున్నా. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలు దేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని మిమ్మల్లందర్నీ అడుగుతున్నా.. తోడుగా ఉండమని ప్రాథేయపడుతున్నా. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా’ అని జగన్ అన్నారు. 

More Telugu News