ebc: ఉద్యోగాలే లేనప్పుడు ఈబీసీ రిజర్వేషన్లు కల్పించి ఏం ప్రయోజనం?: ఎస్పీ ఎంపీ రాంగోపాల్ యాదవ్

  • ఈబీసీ రిజర్వేషన్లపై చాలా మంది కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది
  • ఉన్న రిజర్వేషన్లనే సక్రమంగా అమలు చేయడం లేదు
  • పార్లమెంటు ఎన్నికల కోసమే ఈ బిల్లును తీసుకొచ్చారు

బీజేపీ ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ఈబీసీ రిజర్వేషన్లపై చాలా మంది కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ అన్నారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లనే సక్రమంగా అమలు చేయడం లేదని చెప్పారు. ఉద్యోగాల్లో సామాజిక సమతుల్యత లేదని విమర్శించారు. రెండు, మూడు శాతం జనాభా ఉన్న వర్గాలకే ఉన్నత పదవులు దక్కుతున్నాయని చెప్పారు.

నోట్ల రద్దు వల్ల పరిశ్రమల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాల కోత పడిందని రాంగోపాల్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే లేనప్పుడు... ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు అర్థమే లేదని చెప్పారు. ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు పేదల కోసం తెచ్చింది కాదని... పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చారని విమర్శించారు. ఈబీసీలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే... మూడేళ్ల క్రితమే బిల్లును తీసుకురావాల్సిందని చెప్పారు. ఎవరి కోసం ఈ బిల్లును తీసుకొస్తామని చెబుతున్నారో... నిజంగా ఆ వర్గాలకు న్యాయం జరగదని అన్నారు. 

More Telugu News