manmohan singh: ‘మన్మోహన్ సింగ్’ పరువు పోయేలా సినిమాను తీశారు.. వెంటనే ఆపేయండి!: హైకోర్టులో కాంగ్రెస్ నేత పిటిషన్

  • పంజాబ్-హరియాణా హైకోర్టులో దాఖలు చేసిన అనుమిత్ సోధీ
  • రాజకీయ లబ్ధి కోసమే రిలీజ్ చేస్తున్నారని వ్యాఖ్య
  • ఎల్లుండి విడుదల కానున్న యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం ఆధారంగా ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రధాని మీడియా సలహాదారు సంజయ్ బారూ రాసిన పుస్తకం ఆధారంగా దీన్ని రూపొందించారు. ఇప్పటికే బిహార్ లోని ఓ కోర్టు ఈ సినిమా యూనిట్ పై కేసు నమోదుచేయాలని ఆదేశించగా, తాజాగా మరో తలనొప్పి ఎదురైంది. జనవరి 11న విడుదల కానున్న ఈ సినిమాను అడ్డుకోవాలని కాంగ్రెస్ నేత  పంజాబ్-హరియాణా హైకోర్టును ఆశ్రయించారు.

పంజాబ్ పీసీసీ సభ్యుడు అనుమిత్ సింగ్ సోధీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పరువు, ప్రతిష్టలకు అంతర్జాతీయ స్థాయిలో భంగం కలిగేలా, నష్టం చేకూర్చేలా సినిమా ఉందని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ హయాంలో దేశం పలు రంగాల్లో  అభివృద్ధిలో దూసుకుపోయిందని గుర్తుచేశారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే సరిగ్గా ఎన్నికల ముందు ఈ సినిమాను విడుదల చేస్తున్నారని తెలిపారు. మరోవైపు ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఫ్యాషన్ డిజైనర్ పూజా మహాజన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కొట్టివేసిన హైకోర్టు.. పిటిషన్ కు బదులుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేయాలని సూచించింది. దీంతో ఆమె సినిమాపై నిషేధం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు.

More Telugu News