Hyderabad: ఇంటి నుంచి రోడ్డు మీదకు నీళ్లొస్తే ఇకపై భారీ వడ్డన.. జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం

  • ఇష్టానుసారం రోడ్లపైకి నీటిని వదిలేస్తున్న యజమానులు
  • ఆపోలో ఆసుపత్రికి రూ. 2 లక్షల జరిమానా
  • మౌఖిక ఆదేశాలు జారీ చేసిన జీహెచ్ఎంసీ

హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కాలనీల్లోని రోడ్లపైకి నీళ్లను ఇష్టానుసారం వదిలిపెడుతుండడంతో వేసిన కొద్దికాలానికే అవి పాడవుతున్నాయి. అంతేకాక, రోడ్లు నిత్యం బురదమయంగా మారుతున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో స్పందించిన జీహెచ్ఎంసీ నీళ్లను రోడ్లపైకి వదిలేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జోనల్ కార్యాలయాలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. రోడ్డుపైకి నీళ్లు వదులుతూ పట్టుబడిన వారికి రూ. 2 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జరిమానా విధించాలని నిర్ణయించారు. మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన పూర్తి విధివిధానాలను రూపొందించనున్నట్టు అధికారులు తెలిపారు.

నగర పరిధిలోని రహదారుల నిర్మాణం, నిర్వహణ కోసం బల్దియా ఏటా రూ. 600 కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే, ఇళ్ల నుంచి నీరు రోడ్లపైకి వచ్చి నిల్వ ఉండడంతో రహదారులు త్వరగా పాడవుతున్నాయి. ఈ సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్టు ఇటీవల జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైనట్టు బల్దియా కమిషనర్ దాన కిశోర్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో రోడ్లపైకి నీళ్లను వదులుతున్నఅపోలో ఆసుపత్రికి ఇటీవల రూ. 2 లక్షల జరిమానా విధించారు. అలాగే, ఇళ్ల నుంచి నీటిని బయటకు వదులుతున్న వారికి కూడా భారీగా జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇంటిలోని వాడుక నీరు తప్పనిసరిగా డ్రైనేజీ కనెక్షన్ ద్వారా వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

More Telugu News