CBI: మోదీ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... సీబీఐ బాధ్యతలు తిరిగి అలోక్ వర్మ చేతికే!

  • బలవంతపు సెలవుపై పంపిన కేంద్రం
  • అత్యున్నత ధర్మాసనాన్ని ఆశ్రయించిన అలోక్ వర్మ
  • కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన సుప్రీం

సీబీఐ నుంచి బలవంతంగా సెలవుపై బయటకు వెళ్లిన డైరెక్టర్ అలోక్ వర్మకే తిరిగి బాధ్యతలు అప్పగించాలని చెబుతూ సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం కీలక తీర్పిచ్చింది. ఈ తీర్పు ఆయన్ను వ్యతిరేకిస్తున్న నరేంద్ర మోదీ సర్కారుకు ఓ రకంగా షాకే. ఈ ఉదయం తీర్పిచ్చిన సుప్రీంకోర్టు, అలోక్ వర్మను తిరిగి కొనసాగించాలని, బలవంతంగా సెలవుపై పంపడం కుదరదని తేల్చింది.

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్థానాల మధ్య నెలకొన్న విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో, కేంద్రం, వర్మపై ఒత్తిడి తెచ్చి సెలవు పెట్టించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నరేంద్ర మోదీ సర్కారుకు తనను సెలవుపై పంపించే అధికారం లేదని ఆయన చేసిన వాదనను కోర్టు అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ, ఇదే సమయంలో అలోక్ వర్మ భవిష్యత్తును సెలక్షన్ కమిటీ నిర్ణయిస్తుందని, సెలక్షన్ కమిటీ నిర్ణయం వెలువడేంత వరకూ ఆయన విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీల్లేదని న్యాయమూర్తి ఆదేశించారు. 

More Telugu News