అమ్మకానికి పాములు...సామాజిక మాధ్యమాల ద్వారా యువకుల బేరసారాలు

08-01-2019 Tue 09:42
  • మెడలో కొండచిలువతో ఫొటో దిగి ప్రకటన
  • ఇంటిపై దాడిచేసి స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు
  • వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు
తమ వద్ద అక్రమంగా భద్రపరిచిన రెండు పాముల్ని సామాజిక మాధ్యమాల ద్వారా విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులు కటకటాల పాలయ్యారు. వివరాల్లోకి వెళితే...తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లా ఘటకేసర్‌ మండలం చౌదర్‌గూడలోని వెంకటాద్రి టౌన్‌షిప్‌లో షారన్‌మోసెస్‌ నివాసం ఉంటున్నాడు. ఇతని స్నేహితుడు వానోరస్‌ ప్రవీణ్‌. వీరిద్దరూ రెండు రోజుల క్రితం ఒక కొండ చిలువ, మనుపాము (బ్రౌంజ్‌ బ్యాక్‌ స్నేక్‌)లను  సేకరించారు. వీటిని అమ్మేందుకు ప్రవీణ్‌ కొండ చిలువను మెడలో వేసుకుని దిగిన ఫొటోలను ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో అప్‌లోడ్‌ చేశారు. ఈ పోస్టులు వైరల్‌గా మారి అటవీ శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది.

దీంతో సోమవారం నిందితుల ఇంటిపై దాడిచేసి రెండు పాములను స్వాధీనం చేసుకోవడంతోపాటు, ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని రంగారెడ్డి మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఎదుట హాజరు పరిచారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం కొండచిలువ అమ్మకానికి ప్రయత్నించిన వారికి మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.