Hyderabad: అలాంటి పార్టీ వ్యక్తిని ప్రొటెం స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారా?: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజం

  • ముంతాజ్ ఖాన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయను
  • పూర్తి స్థాయి స్పీకర్ వచ్చాకే ప్రమాణ స్వీకారం చేస్తా
  • ‘భారత్ మాతాకీ జైై’, ‘వందేమాతరం పాడని’ అటువంటి పార్టీ వ్యక్తికి ఈ పదవా?

దేశ ధర్మం పట్ల గౌరవం లేని వ్యక్తులను ప్రొటెం స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారా? అని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రొటెం స్పీకర్ ముంతాజ్ ఖాన్ సమక్షంలో తాను ప్రమాణ స్వీకారం చేసే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీకి పూర్తి స్థాయి స్పీకర్ వచ్చిన తర్వాతే ఆయన ఛాంబర్ లో తాను ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు.

 తాను రాజకీయాల్లోకి రాకముందు నుంచీ ఎంఐఎం గోహత్యలు చేయిస్తున్న విషయం పట్ల; దేశం, ధర్మం విషయంలో వారు తమ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రొటెం స్పీకర్ పదవి ముంతాజ్ ఖాన్ కు ఇచ్చిన విషయం మీడియా ద్వారా తెలిసి తాను చాలా బాధపడ్డానని అన్నారు.

దేశం పట్ల, ధర్మం పట్ల గౌరవం లేని, ‘భారత్ మాతాకీ జైై’ అనని, ‘వందేమాతరం పాడని’ అటువంటి పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ప్రొటెం స్పీకర్ పదవిని కట్టబెడతారా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో ఇంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ పదవికి అర్హుడైన ఒక్క సీనియర్ ఎమ్మెల్యే ఆ పార్టీలో లేరా? అని రాజాసింగ్ ప్రశ్నించారు. అలాంటి ఎమ్మెల్యే ముందు తాను ప్రమాణ స్వీకారం చేయనని, అసెంబ్లీ స్పీకర్ గా ఎవరైతే ఎన్నికవుతారో వారి ఛాంబర్ లో తాను ప్రమాణ స్వీకారం చేస్తానని స్పష్టం చేశారు.

More Telugu News