Telangana: తెలంగాణ కేబినెట్ సమావేశం.. నామినేటెడ్ ఎమ్మెల్యేగా స్టీఫెన్ సన్ కు మరో ఛాన్సిచ్చిన కేసీఆర్!

  • మిగతా ఎమ్మెల్యేలతో పాటే ఆయన ప్రమాణస్వీకారం
  • తీర్మానాన్ని గవర్నర్ కు పంపిన మంత్రిమండలి
  • ఉర్దూ, తెలుగు, ఇంగ్లిష్ లో రాజ్యాంగం, నిబంధనల పుస్తకాలు

హైదరాబాద్ లో సోమవారం తెలంగాణ మంత్రివర్గం తొలిసారి సమావేశమయింది. ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ఆంగ్లోఇండియన్ స్థానానికి స్టీఫెన్ సన్ పేరును కేబినెట్ సిఫార్సు చేసింది. ఈ మేరకు తీర్మానం చేసిన ప్రతిని గవర్నర్ కు పంపింది. ఎమ్మెల్యేలతో పాటు నామినేటెడ్ సభ్యుడి ప్రమాణస్వీకార కార్యక్రమం జరపాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘాన్ని అభినందించింది. అలాగే ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులకు రాజ్యాంగం, నిబంధనల పుస్తకాలను తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ లో ఇవ్వాలని నిర్ణయించింది.

తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 120 స్థానాలు ఉన్నప్పటికీ 119 సీట్లకే ఎన్నికలు నిర్వహిస్తారు. మిగిలిన ఒక్క స్థానాన్ని ఆంగ్లో ఇండియన్ సభ్యుడితో భర్తీ చేస్తారు. స్టీఫెన్ సన్ పేరును నామినేటెడ్ ఎమ్మెల్యే పదవికి 2014లో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని మంత్రిమండలి సిఫార్సు చేసింది. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘ఓటుకు నోటు’ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా నిందితులను పట్టించేందుకు స్టీఫెన్ సన్ స్టింగ్ ఆపరేషన్ కు సహకరించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఆయనకు మరోసారి నామినేటెడ్ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. తాజా ఆదేశాల నేపథ్యంలో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 91కి చేరుకోనుంది. ఆంగ్లోఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యేకు మిగతా శాసనసభ్యుల్లాగే అన్ని అవకాశాలు ఉంటాయి.

More Telugu News