Jagan: కేసీఆర్ ఆ ఒక్క మాటంటే నేను చాలా సంతోషిస్తా... ఆయన్ను ఇంతవరకూ కలవనే లేదు: జగన్

  • గెలిచిన తరువాత కావాలనే ఫోన్ చేశాను
  • గొప్పగా చేశారన్నా అంటూ విష్ చేశా
  • వైకాపా అధినేత వైఎస్ జగన్

తాను ఇంతవరకూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా కలిసింది లేదని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో, కేసీఆర్ చేసిన 'రిటర్న్ గిఫ్ట్' వ్యాఖ్యల ప్రస్తావన వచ్చిన వేళ, జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకేఒక్కసారి తాను కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడానని, అది కూడా మొన్న గెలిచిన తరువాత కంగ్రాచ్యులేషన్స్ చెప్పేందుకు ఫోన్ చేశానని అన్నారు.

"అది కూడా కావాలనే ఫోన్ చేశాను. కావాలనే... తప్పేముందండీ? గెలిచారు. చంద్రబాబునాయుడి మీద గెలిచారు. అందుకని కావాలనే ఫోన్ చేసి, గొప్పగా చేశారన్నా. కంగ్రాచ్యులేషన్స్ చెప్పి, విష్ చేశాను" అని అన్నారు.

చంద్రబాబు క్యారెక్టర్, ఆయన నైజాన్ని దేశ ప్రజలంతా చూశారని, కేసీఆర్ మరింత దగ్గరగా చూశారు కాబట్టే, ఆయనకు తనపై అభిమానం ఉండివుండవచ్చని జగన్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు మంచి జరిగేలా ప్రత్యేక హోదా డిమాండ్ కోసం ముందడుగు వేసిన ఆయన్ను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రానికి కేసీఆర్ మద్దతు అవసరమని తాను భావిస్తున్నానని అన్నారు.

ఏపీకి చెందిన 25 మంది ఎంపీలకు, తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు కలిస్తే, ప్రత్యేక హోదా కచ్చితంగా వస్తుందని జగన్ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తన ఎంపీలతో కలిసొస్తానని కేసీఆర్ అంటే తనకు అంతకన్నా సంతోషం ఇంకేమీ ఉండదని, 42 మంది ఎంపీలు పోరాడితే, కేంద్రంలో ఏ ప్రభుత్వమైనా తలవంచక తప్పదని చెప్పారు. 

More Telugu News