Rape: విద్యార్థినులను వ్యభిచారులుగా మార్చిన కేసులో... 17 మంది నేరస్తులేనన్న కడలూర్ కోర్టు!

  • 2014లో కడలూరు సమీపంలో ఘటన
  • 7, 8 చదువుతున్న అమ్మాయిలను బలిపశువులుగా మార్చిన 19 మంది
  • కేసు విచారణ పూర్తి, రేపు శిక్షలు ఖరారు

తమిళనాడులో పాఠశాల విద్యార్థినులను మాయమాటలతో వ్యభిచారకూపంలోకి దింపిన కేసులో ఓ మత బోధకుడితో పాటు 16 మంది నేరస్తులేనని తమిళనాడులోని కడలూరు మహిళా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వీరికి శిక్షలను సోమవారం నాడు ఖరారు చేస్తామని న్యాయమూర్తి వెల్లడించారు.

పూర్వపరాల్లోకి వెళితే, 2014 సంవత్సరంలో కడలూరు ప్రభుత్వ పాఠశాలలో 7, 8 తరగతి చదివే ఇద్దరు అమ్మాయిలు స్నేహితులు. వీరు పాఠశాలకు సమీపంలోని ఓ చిన్న షాపుకు వెళ్లి టిఫిన్లు, ఇతర తినుబండారాలు కొనుక్కుంటుండేవారు. ఈ క్రమంలో 7వ తరగతి బాలిక దుకాణానికి వెళ్లిన వేళ, దాని యజమాని భార్య ధనలక్ష్మి, ఆనందరాజ్ అనే తన ప్రియుడితో కలిసుండటాన్ని చూసింది. దీంతో తన బండారం బయటపడుతుందన్న భయంతో, బాలికను ఇంట్లోనే నిర్బంధించి, తొలుత ఆనందరాజ్ తో, ఆపై తన స్నేహితులైన మోహన్ రాజ్, మదివాసన్ లతో అత్యాచారం చేయించింది.

ఆపై బాలిక తీవ్ర అస్వస్థతకు గురికాగా, ఆమె 8వ తరగతి స్నేహితురాలిని పిలిపించింది. ఆ పాపపైనా పదేపదే అత్యాచారం చేయించి, ఇద్దరినీ రహస్యంగా విరుదాచలంలోని వ్యభిచార బ్రోకర్ కళకు అప్పగించింది. ఆమె, దిట్టకుడికి చెందిన మత బోధకుడు అరుల్ దాస్ కు వారిని అప్పగించగా, అందరూ కలిసి విల్లుపురం, కడలూర్ జిల్లాల్లోని పలు లాడ్జీలు, అద్దె ఇళ్లకు తిప్పుతూ వ్యభిచారం చేయించారు.

చివరకు వడలూర్ లో ఉంటున్న సతీష్ కుమార్, తమిళరసిలకు వారిని అమ్మేయగా, ఒకరోజు బాలికలు తప్పించుకుని దిట్టకుడి పోలీసుల వద్దకు చేరి, తాము పడ్డ వేదనను వివరించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, నిందితుల్లో ఇద్దరు మినహా  17 మందిని అరెస్ట్ చేశారు.

కేసు విచారణ అలస్యం అవుతోందని మద్రాస్ హైకోర్టులో విద్యార్థినుల తరఫున రిట్ దాఖలు కాగా, ఈ కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ, 2016, జూలై 4న హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆపై మొత్తం 19 మందిపై కడలూరు మహిళా కోర్టులో చార్జ్ షీట్ దాఖలైంది. బాధిత విద్యార్థినులు కోర్టుకు హాజరై 17 మందినీ గుర్తించారు. ఆపై విద్యార్థినులకు పరిహారంగా రూ. 2 లక్షలు చెల్లించాలని తీర్పిచ్చిన కోర్టు, విచారణను పూర్తి చేసి, మత బోధకుడు అరుల్ దాస్ సహా 17 మంది నేరస్తులేనని తేల్చింది.

More Telugu News