India: నవ్యాంధ్రకు భారీ కాగిత పరిశ్రమ... రూ. 24,500 కోట్ల పెట్టుబడి!

  • ప్రకాశం జిల్లాకు రానున్న ఏపీపీ
  • రామయ్యపట్నం వద్ద భారీ కాగితపు పరిశ్రమ
  • 15 వేల మందికి ఉపాధి

ఇండియాకు వచ్చిన అతిపెద్ద విదేశీ పెట్టుబడిని నవ్యాంధ్ర ఆకర్షించింది. ఇండొనేషియా కేంద్రంగా పనిచేస్తున్న పల్ప్ అండ్ పేపర్ తయారీ సంస్థ ఆసియా పల్ప్ అండ్ పేపర్ గ్రూప్ (ఏపీపీ), ప్రకాశం జిల్లాలోని రామయ్యపట్నం వద్ద భారీ కర్మాగారాన్ని నెలకొల్పనుంది. ఇందుకోసం రూ. 24,500 కోట్లను (3.5 బిలియన్ డాలర్లు) ఏపీపీ పెట్టుబడిగా పెట్టనుంది. రామయ్యపట్నంలో సాలీనా 50 లక్షల టన్ను పేపర్ తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఉండనుంది. ప్రాజెక్టు నిమిత్తం ఇప్పటికే 2,500 ఎకరాల సమీకరణ పూర్తికాగా, ప్లాంటు పూర్తయితే 15 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుంది.

ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డ్ సీఈఓ జే కృష్ణ కిశోర్ ఈ విషయమై మాట్లాడుతూ, ఇండియాలో ఓ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుకు వచ్చిన అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఇదేనని, 50 వేల మంది రైతులకు లబ్ది చేకూరనుందని, ఇండియాలో అతిపెద్ద పేపర్ యూనిట్ కూడా ఇదే కానుందని అన్నారు. 12 నెలల వ్యవధిలోనే ఈ ప్లాంటుకు అవసరమైన అన్ని అనుమతులూ లభించేలా చూస్తామని చెప్పారు. కాగా, ఇండియాలో ఏపీపీ ప్లాంటును భారత పేపర్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ కార్యదర్శి రోహిత్ పండిట్ స్వాగతించారు. గత నాలుగైదేళ్లుగా పేపర్ ఇండస్ట్రీ ముడి సరుకుల లభ్యత లేక, ఒత్తిడిలో ఉందని ఆయన అన్నారు.

More Telugu News