Telangana: తెలంగాణలోనే చంద్రబాబుపై ప్రజలు అంత ఆగ్రహంతో ఉన్నారంటే... ఇక ఏపీ గురించి మీరే ఊహించుకోండి!: వైఎస్ జగన్

  • తెలంగాణలో చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేశారు
  • టీడీపీ అభ్యర్థులు 50 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు
  • అన్యాయం చేసిన బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటే
  • వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్

తెలంగాణలో చంద్రబాబుపై ప్రజలెంత ఆగ్రహంతో ఉన్నారో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రుజువై పోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. సాక్షి టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తెలంగాణలో సీమాంధ్రుల ఓట్లు అధికంగా ఉన్న చోట్ల, టీడీపీ అభ్యర్థులు 40 నుంచి 50 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని గుర్తు చేశారు. చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని తిరిగినా రెండు సీట్లను మించి సాధించలేకపోయారని, తెలంగాణలోనే చంద్రబాబుపై ప్రజలు అంత ఆగ్రహంతో ఉన్నారంటే, ఇక ఏపీలో ప్రజలు ఎలా ఉంటారో మీరే ఊహించుకోవాలని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదా ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా బీజేపీ తీవ్ర అన్యాయం చేసి, కాంగ్రెస్ పార్టీ సరసనే నిలిచిందని వ్యాఖ్యానించిన జగన్, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కదని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తాను చేస్తున్న పోరాటానికి క్లైమాక్స్ పాదయాత్రని అభివర్ణించిన జగన్, 2014 నుంచి 2017 వరకూ తమ వాణిని అసెంబ్లీ నుంచే ప్రజలకు వినిపించామని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారని వేచి చూశామని, స్పీకర్ అన్యాయాన్ని చూడలేకే అసెంబ్లీకి వెళ్లదలచుకోలేదని స్పష్టం చేశారు.

More Telugu News