chalasani srinivas: రాష్ట్రపతి వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లండి.. జగన్, పవన్ లను మేము ఒప్పిస్తాం: చంద్రబాబుకు చలసాని శ్రీనివాస్ విజ్ఞప్తి

  • రాష్ట్రానికి మోదీ తీరని అన్యాయం చేస్తున్నారు
  • ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలి
  • హోదా అంశాన్ని మోదీ దృష్టికి తీసుకెళతానని రాజ్ నాథ్ హామీ ఇచ్చారు

ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం ఉద్ధృతం చేయాలని చలసాని శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు రాష్ట్రపతి వద్దకు అఖిలపక్షాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకెళ్లాలని కోరారు. వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లను తాము ఒప్పిస్తామని చెప్పారు. ఈరోజు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో చలసాని శ్రీనివాస్ తదితరులు సమావేశమయ్యారు.

 అనంతరం మీడియాతో చలసాని మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను నెరవేర్చాలని, పోలవరం ప్రాజెక్టుకు నిధులను విడుదల చేయాలని రాజ్ నాథ్ ను కోరామని చెప్పారు. ప్రత్యేక హోదా విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళతానని రాజ్ నాథ్ హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రానికి మోదీ తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

More Telugu News