Andhra Pradesh: చంద్రబాబు అడ్డుకుంటున్నారు.. లేదంటే బీజేపీ నేతలు రోడ్ల మీద తిరగలేరు!: కేశినేని వార్నింగ్

  • టీడీపీ శ్రేణులు సంయమనం పాటిస్తున్నాయి
  • నిధుల విషయంలో మోదీ అబద్ధాలు సరికాదు
  • మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ ను నిన్న తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ శ్రేణులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘటనపై టీడీపీ నేత, పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని స్పందించారు. శాంతిమార్గంలో వెళ్లాల్సిందిగా తమకు సీఎం చంద్రబాబు సూచించారని నాని తెలిపారు. చంద్రబాబు తమకు అడ్డుపడకుంటే బీజేపీ నేతలు రోడ్లపై తిరిగే పరిస్థితే ఉండదని హెచ్చరించారు. పార్టీ అధినేత సూచనలతో టీడీపీ శ్రేణులు సంయమనం పాటిస్తున్నాయని పేర్కొన్నారు.

ఏపీకి నిధుల విడుదల విషయంలో సాక్షాత్తూ ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పడం సరికాదని నాని అభిప్రాయపడ్డారు. ఇచ్చిన నిధులను ఇవ్వలేదని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. బీజేపీకి గత ఎన్నికలతో పోల్చుకుంటే ఓ 200 లోక్ సభ స్థానాలు తక్కువ వస్తాయని జోస్యం చెప్పారు.

కాకినాడ జేఎన్డీయూలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న చంద్రబాబును బీజేపీ నేతలు, కార్యకర్తలు నిన్న అడ్డుకున్నారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలు, కార్యక్రమాల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. తొలుత బీజేపీ కార్యకర్తలను సముదాయించేందుకు సీఎం యత్నించారు. అయితే ఆందోళనకారులు వెనక్కు తగ్గకపోవడంతో వారిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News