Telangana: తెలంగాణ ఐఏఎస్ అధికారిణి చంద్రకళ ఇంటిపై సీబీఐ దాడులు!

  • యూపీ, తెలంగాణ సహా 12 చోట్ల దాడులు
  • ఇసుక మాఫియాతో సంబంధాలపై కేసు నమోదు
  • అక్రమార్కులపై గతంలో ఉక్కుపాదం మోపిన చంద్రకళ

తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారిణి చంద్రకళ ఇంటిపై సీబీఐ అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ లో ఇసుక కుంభకోణం వ్యవహారంలో కేసు నమోదుచేసిన అధికారులు ఈరోజు యూపీ, తెలంగాణ లోని 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఇసుక మాఫియాతో కలిసి చంద్రకళ అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంలో అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదుచేసిన అధికారులు తెలంగాణలోని కరీంనగర్ తో పాటు యూపీలోని 12 చోట్ల సోదాలు కొనసాగిస్తున్నారు.

కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గర్జనపల్లి చంద్రకళ స్వగ్రామం. 2008లో సివిల్స్ సాధించిన చంద్రకళ..అలహాబాద్ లో ట్రైనీ ఆర్డీఓగా చేరారు. బులంద్ షహర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో రహదారి పనుల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్లకు చంద్రకళ క్లాస్ పీకిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా నాణ్యత లేకుండా పనులు చేసినందుకు 12 కాంట్రాక్టులను సైతం ఆమె రద్దు చేశారు. అత్యంత నిక్కచ్చిగా ఉండే అధికారిణిగా పేరుతెచ్చుకున్న చంద్రకళను ప్రధాని మోదీ స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్‌గా, కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శిగా నియమించారు. తాజాగా అలాంటి అధికారిణిపై సీబీఐ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం.

More Telugu News