Andhra Pradesh: భూమా అఖిలప్రియ అనుచరుల ఇంట్లో అర్ధరాత్రి సోదాలు.. పోలీసులపై మండిపడ్డ ఏపీ మంత్రి!

  • అందరి ఇళ్లలో పోలీసుల తనిఖీలు
  • ఉన్నతాధికారుల ఆదేశాలతోనే చేశామని వెల్లడి
  • గన్ మెన్లను వెనక్కు పంపిన అఖిలప్రియ

ఆంధ్రప్రదేశ్ మంత్రి భూమా అఖిలప్రియ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో తన అనుచరుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించడంపై మండిపడ్డారు. ఈ చర్యలకు నిరసనగా తన గన్ మెన్లను వెనక్కు పంపారు. అంతేకాకుండా తన పర్యటనలో భద్రత కోసం వస్తున్న పోలీసులను రావొద్దని చెప్పేశారు.

అఖిలప్రియ అనుచరులతో పాటు పలువురి ఇళ్లపై నంద్యాల పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. దీంతో ఈ విషయాన్ని అనుచరులు మంత్రి అఖిలప్రియకు తెలియజేశారు. వెంటనే అధికారులకు ఫోన్ చేసిన మంత్రి.. ఈ తనిఖీలు ఎవరు చేయమని ఆదేశించారని ప్రశ్నించారు. దీంతో ఉన్నతాధికారులు చెప్పడంతోనే తాము తనిఖీలు చేపట్టామని పోలీసులు చెప్పారు. అందరి ఇళ్లలోనూ ఈ సందర్భంగా తనిఖీలు చేపట్టామని వివరణ ఇచ్చారు.

పోలీసుల వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి అఖిలప్రియ.. అధికారుల తీరుకు నిరసనగా తన గన్ మెన్లను వెనక్కు పంపారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆమెను సముదాయించేందుకు యత్నించారు. అయినా శాంతించని మంత్రి.. జన్మభూమి కార్యక్రమంలో తనకు రక్షణగా రావొద్దని స్థానిక పోలీస్ అధికారులకు తేల్చిచెప్పారు. అయినప్పటికీ మంత్రి పర్యటన నేపథ్యంలో స్థానిక పోలీసులు అక్కడకు రావడంతో అఖిలప్రియ వారిపై మండిపడ్డారు.

More Telugu News