Telangana: ప్రజల కోసం రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేయించా.. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడించారు!: టీఆర్ఎస్ నేత

  • ప్రజల తీర్పును శిరసావహిస్తున్నా
  • అశ్వారావుపేటను అభివృద్ధి చేశాను
  • టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ వెంకటేశ్వర్లు వెల్లడి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నట్లు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత తాటికొండ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో తన ఓటమితో టీఆర్ఎస్ శ్రేణులు కోలుకోలేదని వ్యాఖ్యానించారు. తనను నమ్ముకుని వేలాది మంది కార్యకర్తలు, నాయకులు ఉన్నారనీ, వాళ్లందరికీ అండగా ఉంటానని పేర్కొన్నారు. అశ్వారావుపేట జెడ్పీటీసీ సభ్యుడి ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

అశ్వారావుపేటలో తాను గత నాలుగేళ్లలో రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేయించాననీ, సంక్షేమ పథకాలను అమలు చేశానని వెంకటేశ్వర్లు తెలిపారు. అయినా ప్రజలు తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కొత్తదనాన్ని కోరుకోవడం వల్లే తాను ఓటమి చవిచూశానని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అశ్వారావుపేటలో మారుమూల ప్రాంతాల్లో సైతం అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

రాష్ట్రమంతా ఓవైపు ఉంటే, ఖమ్మం జిల్లా మాత్రం మరోవైపు ఉండటం బాధాకరమని వాపోయారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అనుభవిస్తున్న ప్రజలు కూడా చిన్నచిన్న కారణాలతో తమకు ఓట్లు వేయలేదని వ్యాఖ్యానించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో విజయం పార్లమెంటు ఎన్నికలకు నాంది కావాలన్నారు.

More Telugu News