Sabarimala: మరో మహిళ అయ్యప్పను దర్శించుకోవడంతో రణరంగంగా మారిన కేరళ

  • ఆలయంలోకి ముగ్గురు మహిళలు
  • 1369 మంది అరెస్ట్
  • 801 మందిపై కేసులు
  • బీజేపీ కార్యాలయం దహనం

శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశంపై కేరళ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. జనవరి 2న బిందు, కనకదుర్గ అనే మహిళలు ఆలయంలోకి వెళ్లిన విషయం విదితమే. నేడు శ్రీలంకకు చెందిన 46 ఏళ్ల శశికళ అనే మహిళ అయ్యప్పను దర్శించుకుని పూజలు నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు. కానీ శశికళ మాత్రం తనను 18 మెట్ల వద్దే అడ్డుకున్నారని తెలిపారు.

ఈ ఘటనల నేపథ్యంలో కేరళ రణరంగంగా మారింది. నేటి ఉదయం మలబార్ దేవస్వామ్ బోర్డు సభ్యుడి ఇంటి వద్ద ఆందోళనకారులు నాటు బాంబులు విసిరారు. అలాగే పథానంతిట్ట ప్రాంతంతోపాటు మరికొన్ని చోట్ల నాటు బాంబులు పేలాయని పోలీసులు తెలిపారు. తిరువనంతపురం, మలప్పురం, పాలక్కాడ్, కన్నూర్, కోజికోడ్ తదితర ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

దీంతో లాఠీచార్జి ద్వారా ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. కన్నూరులోని బీజేపీ కార్యాలయాన్ని కూడా ఆందోళనకారులు తగులబెట్టారు. ఈ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే 801 మందిపై కేసులు పెట్టి, 1369 మందిని అరెస్ట్ చేశారు. అలాగే మరో 717 మందిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News