Karnataka: కర్ణాటకలో సినీ ప్రముఖులపై ఐటీ దాడులు.. స్పందించిన హీరోలు యశ్, సుదీప్!

  • నిన్న జరిగిన ఐటీ దాడులు
  • 23 చోట్ల అధికారుల తనిఖీలు
  • ఆదాయానికి, రిటర్నులకు వ్యత్యాసం ఉండటంతోనే

కన్నడ సినీ పరిశ్రమ ప్రముఖులపై ఐటీ శాఖ నిన్న దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. శాండల్ వుడ్ లో పలు హిట్ చిత్రాలు తెరకెక్కిన నేపథ్యంలో నటీనటులు, నిర్మాతలు అందుకు అనుగుణంగా ఐటీ రిటర్నులు దాఖలు చేయకపోవడంతో ఐటీ శాఖ అధికారులు నిన్న కర్ణాటకలోని 23 చోట్ల తనిఖీలు చేపట్టారు. నటులు యశ్‌, పునీత్‌ రాజ్‌కుమార్, రాక్‌‌లైన్‌ వెంకటేశ్‌, సుదీప్‌, శివ రాజ్‌కుమార్‌ తో పాటు ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య రాధిక ఇంటిపై సైతం దాడులు జరిగాయి. తాజాగా ఈ ఐటీ దాడులపై కేజీఎఫ్ నటుడు యశ్ స్పందించాడు.

ఈ విషయమై యశ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘నాకేం భయం లేదు. ఐటీ దాడులకు భయపడను. నేనే తప్పూ చేయలేదు. ఐటీ అధికారులను వారి పనిని చేసుకోనివ్వాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలకు రావొద్దు’ అని తెలిపాడు. మరోవైపు సుదీప్‌ మాట్లాడుతూ.. ‘ఐటీ దాడుల గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఈ దాడులకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు’ అని వెల్లడించాడు. కాగా, ఈ దాడుల్లో అధికారులు విలువైన పత్రాలు, నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

More Telugu News