Andhra Pradesh: ‘జగన్’ కేసులో ఎన్ఐఏను ఆశ్రయిస్తా.. చంద్రబాబు, డీజీపీ కాల్ రికార్డులు బయటకుతీస్తా!: ఎమ్మెల్యే ఆర్కే

  • చంద్రబాబును రక్షించేందుకు డీజీపీ కుట్ర
  • రెండు గంటల్లోనే డీజీపీ మీడియా సమావేశం పెట్టారు
  • చంద్రబాబు ఈ దాడిని ఎగతాళి చేశారని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఎన్ఐఏ విచారణ చేపట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు జగన్ పై జరిగిన దాడిని ఎగతాళి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగితే ఎవరు కేసు నమోదు చేయాలన్న విషయం కూడా ఏపీ డీజీపీకి తెలియలేదని ఎద్దేవా చేశారు. ఈ కనీస విషయం తెలియకపోతే ఆయన డీజీపీ పదవికి అనర్హుడైనా అయ్యుండాలనీ, లేదా చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి ఉండాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణారెడ్డి మాట్లాడారు.

దేవుడి దయతో కోడికత్తి దాడి నుంచి జగన్ తప్పించుకున్నారని రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ హత్యాయత్నం ఘటనను నీరుగార్చేందుకు సీఎం చంద్రబాబు, ఏపీ డీజీపీ, ఇతర అధికారులు ప్రయత్నించారని విమర్శించారు. జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దాడి జరిగితే సాయంత్రం 4 గంటలకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందని చెప్పారు. కానీ మధ్యాహ్నం 2 గంటలకే ఏపీ డీజీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబును కాపాడటానికి డీజీపీ యత్నించారనీ, ఆయన్ను వదలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ విషయాలన్నింటిని ఎన్ఐఏ ముందు పెడతామని హెచ్చరించారు. ‘జగన్ తప్పించుకున్నాడు. రేపు కుట్ర బయటకు వస్తుంది’ అని ముందుగానే డీజీపీ మీడియా సమావేశం పెట్టారని ఆరోపించారు.

ఈ వ్యవహారంలో సీఎం చంద్రబాబు, డీజీపీ, హర్షవర్ధన్ సహా అందరి కాల్ డేటాను కోరుతాననీ, తాను ఎన్ఐఏ మెట్లు ఎక్కుతానని హెచ్చరించారు. జగన్ పై హత్యాయత్నం కేసును ఏపీ డీజీపీ, అడ్వకేట్ జనరల్ నిర్వీర్యం చేసేందుకు యత్నించారని విమర్శించారు. చట్టపరంగా ఉన్న అవకాశాలన్నింటిని వినియోగించుకుంటామని తేల్చిచెప్పారు. ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు యత్నించిన ప్రతీ ఒక్కరికీ శిక్షలు పడతాయని స్పష్టంచేశారు. ఏపీ సీఎం తన ప్రయోజనాల కోసం పోలీస్, న్యాయవ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.

More Telugu News