Andhra Pradesh: స్మార్ట్ ఫోన్ ను దాచేసిన తల్లిదండ్రులు.. కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న యువకుడు!

  • ఏపీలోని విజయవాడలో ఘటన
  • ఫోన్ కు బానిసగా మారిన యువకుడు
  • బెదిరించేందుకే చేశానన్న గోపీనాథ్

సెల్ ఫోన్ మన జీవితంలో ఓ భాగం అయిపోయింది. ఓ క్షణం పాటు ఫోన్ కనిపించకపోయినా నానా హైరానా పడిపోతుంటాం. తాజాగా కుమారుడు స్మార్ట్ ఫోన్ లో మునిగిపోవడంతో బాధపడ్డ తల్లిదండ్రులు ఫోన్ ను దాచేశారు. దీంతో మనస్తాపానికి లోనైన సదరు యువకుడు శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో చోటుచేసుకుంది.

విజయవాడలోని శాంతినగర్ లో ఉంటున్న గోపీనాథ్ తండ్రి రంగాతో కలిసి ఆటో నడుపుతుంటాడు. ఈ క్రమంలో ఇటీవల గోపీనాథ్ కొత్త స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేశాడు. పనికిపోకుండా ఫోన్ తో గంటలుగంటలు గడపడంపై అతడిని తల్లిదండ్రులు హెచ్చరించారు. అయినా గోపీనాథ్ ప్రవర్తనను మార్చుకోకపోవడంతో ఫోన్ ను తీసి దాచేశారు. తన స్మార్ట్ ఫోన్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులతో అతను గొడవకు దిగాడు. అయినా ఫోన్ ఇవ్వకపోవడంతో ఆగ్రహానికిలోనై శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

దీంతో తల్లిదండ్రులు, చుట్టుపక్కలవారు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కాలిన గాయాలతో గోపీనాథ్ చికిత్స పొందుతున్నాడు. కాగా, ఫోన్ కోసం కుమారుడు ఇలాంటి అఘాయిత్యానికి తెగబడతాడని భావించలేదని అతని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తాను తల్లిదండ్రులను బెదిరించేందుకే ఇలా చేశానని గోపీనాథ్ తెలిపాడు. అగ్గిపుల్లను దూరం నుంచి వెలిగించాననీ, అయితే పెట్రోల్ కావడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయని చెప్పాడు. 

More Telugu News